- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుల్లెట్ ట్రైన్ హబ్‌గా హైదరాబాద్.. పిల్లర్లపైనే ‘బుల్లెట్’!
హైదరాబాద్ నుంచి పుణె, బెంగళూరు, అమరావతిలకు కేంద్రం బుల్లెట్ ట్రైన్లను మంజూరు చేయగా.. ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నుంచి పుణె, బెంగళూరు, అమరావతిలకు కేంద్రం బుల్లెట్ ట్రైన్లను మంజూరు చేయగా.. ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. అలైన్‌మెంట్‌కు సంబంధించి ప్రాథమికంగా పలు సూచనలను కేంద్రానికి తెలియజేసింది. మెట్రో రైల్ తరహాలో పిల్లర్లపైనే బుల్లెట్ ట్రైన్లు నడిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం మీదుగా వెళ్లే బుల్లెట్ ట్రైన్లపై ఆసక్తి పెరిగింది.
రెండు వరుసల ట్రాక్..
బుల్లెట్ ట్రైన్ల రాకపోకల కోసం పిల్లర్లను నిర్మించి వాటిపై రెండు వరుసల ట్రాక్‌ను నిర్మిస్తారు. ఇవి కేవలం బుల్లెట్ ట్రైన్లు ప్రయాణించేందుకే ఉపయోగపడతాయి. దీని కోసం 17.50 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించి, ఇరువైపులా బఫర్ జోన్‌ను నిర్ధారిస్తారు. ఈ బఫర్ జోన్‌కు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకపోవడమే కాకుండా.. నిర్మాణాలకు షరతులు విధిస్తారు. పిల్లర్లకు ఎలాంటి డ్యామేజీ కావొద్దనే ఉద్దేశంతో వాటి కింద ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా ఫెన్సింగ్ వేస్తారు. బుల్లెట్ ట్రైన్ పిల్లర్ల మీద నుంచి వెళ్తుండటంతో రైతులకు పెద్దగా నష్టం, ఇబ్బంది కానీ ఉండదని, దీంతో భూ సేకరణ కూడా త్వరగా పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా బుల్లెట్ ట్రైన్లు వెళ్లే రూట్లలో రియల్ ఎస్టేట్ సైతం పుంజుంకుంటుందని భావిస్తున్నారు. మరోవైపు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తాయని విశ్లేషిస్తున్నారు. దీంతో తమ ప్రాంతంలో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
520 కిలోమీటర్లు..
రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి పుణె, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, హైదరాబాద్ నుంచి అమరావతి వరకు మూడు రూట్లలో కలిపి రాష్ట్రంలో మొత్తం 520 కి.మీ వరకు బుల్లెట్ ట్రైన్ రూట్లు వెళ్తాయని గుర్తించారు. రైల్వే లైన్‌తో పాటు బుల్లెట్ ట్రైన్ స్టేషన్లు, జంక్షన్లు, ఇతర వాటి కోసం మొత్తంగా దాదాపుగా 2,500 ఎకరాల వరకు భూమి మూడు రూట్లలో అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఈ భూ సేకరణతో పాటుగా బుల్లెట్ ట్రైన్‌కు అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం ఉండదు.
రూ.15-20 లక్షల కోట్లు
బుల్లెట్ ట్రైన్ రూట్లు, మౌలిక సదుపాయాలకు సంబంధించి నిర్మాణ పనులను చేపట్టడానికి కార్పొరేషన్ లేదా ఎస్పీవీ ఏర్పాటు చేస్తారా? అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. బుల్లెట్ ట్రైన్స్ అన్ని రూట్లను పూర్తి చేయడానికి దాదాపుగా రూ.15 లక్షల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని, దాదాపు పదేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఆఖరు వరకు అంచనా వ్యయం రూ.20 లక్షల కోట్లకు పెరగవచ్చని అధికారులు చెప్తున్నారు. ఏటా ప్రతి సంవత్సరం బుల్లెట్ ట్రైన్ల కోసమే రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయి. దీని కోసం కేంద్ర ప్రభుత్వం జపాన్, ఏడీబీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుందని, ఆ సంస్థలు కూడా రుణాలు ఇవ్వడానికి ఇప్పటికే ప్రాథమికంగా అంగీకరించాయని చెప్తున్నారు.
హబ్‌గా హైదరాబాద్
కేంద్రం గత ఫిబ్రవరిలో ప్రకటించిన బడ్జెట్‌లో మొత్తం 7 రూట్లలో బుల్లెట్ ట్రైన్లను మంజూరు చేసింది. ఇందులో ప్రధానమైన రూట్లకు హైదరాబాద్‌ను హబ్‌గా మార్చారు. దీంతో హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్‌గా మారనుంది. హస్ కోసం అవసరమైన భూమిని ప్రభుత్వం గుర్తించింది. శంషాబాద్ సమీపంలోని బహదూర్ గూడలో భూమిని గుర్తించారు. అక్కడ బుల్లెట్ ట్రైన్, మెట్రో, బస్ టర్మినల్స్ ఏర్పాటు చేయనున్నారు. మూడు ఒకే దగ్గర ఉండటం ద్వారా రాబోయే రోజుల్లో బహదూర్ గూడ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా మారనుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ల కోసం సూచించిన రూట్ మ్యాప్ ఫైనల్ కాదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రతిపాదనలు మాత్రమే అడిగారని, కేంద్రం స్వతంత్ర సంస్థతో సర్వే చేయించి, సాంకేతికంగా ఇతరత్రా, భవిష్యత్ అవసరాలు, అనుమతుల సమస్యలకు ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా రూట్ మ్యాప్‌ను ఖరారు చేస్తారని తెలుస్తోంది.






