- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ విపక్ష పార్టీలు లేవనెత్తే అంశాలను తిప్పికొట్టేందుకు సిద్ధం అవుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ విపక్ష పార్టీలు లేవనెత్తే అంశాలను తిప్పికొట్టేందుకు సిద్ధం అవుతోంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఘన విజయం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గణనీయమైన స్థాయిలో సర్పంచ్ లను గెలిచిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. కాగా, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పైన, ప్రభుత్వం పైన చేసిన అనేక కామెంట్లపైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. అసెంబ్లీ వచ్చి మాట్లాడాలని సీఎం, మంత్రులు కేసీఆర్ కి సవాల్ విసిరిన నేపథ్యంలో ఆయన సభకు వస్తున్నందున జరిగే అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి.
ఇక ఈ అసెంబ్లీ షెషన్స్‌లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కుల రక్షణ, రెండేళ్ల కాంగ్రెస్ పాలన, హిల్ట్ పాలసీ, రైతు భరోసా, యూరియా కొరత, బీసీ రిజర్వేషన్ల అంశాలు తెర మీదకు వచ్చే అవకాశాలున్నాయి. దీనితో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయా సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు సంధించే ప్రశ్నలను, సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నారు. మేరకు తొలిరోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అంశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తొలిరోజు ముగిసిన తర్వాత సభ ఎన్ని రోజులు జరుగుతుందో నేడు జరిగే బీఏసీ సమావేశంలో షెడ్యూల్ ను ఖరారు కానున్నది. జనవరి 2వ తేదీ నుంచి జరిగే సభ కీలకం కానున్నది. ఒక రోజు కృష్ణా జలాలపైన, మరుసటి రోజు గోదావరి జలాలపైన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.
దీంతో ఈ కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ నీటి హక్కులు, ఆ రెండు నదులపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులపైన లోతైన చర్చ జరిగే అవకాశం ఉన్నందున జనవరి 1వ తేదీన సీఎల్పీ సమావేశం కానీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంశాలు, జలాల వినియోగంపై గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలు, రెండేళ్లలో తమ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న చర్యలను శాసన సభా పక్ష సభ్యులకు సీఎంతో పాటు మంత్రులు, ముఖ్య నేతలు వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనితో పాటు సభకు కేసీఆర్ వస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఈ నదీ జలాల అంశం, పదేళ్ల బీఆర్ఎస్ పాలనపైన సభ్యులకు అవగాహన కలిగించే విధంగా ముఖ్య నేతలు వారికి వివరిస్తారని హస్తం నేతలు చెబుతున్నారు.
కేసీఆర్ సభలో లేవనెత్తే అంశాలను ధీటుగా కౌంటర్ ఇచ్చే విధంగా ఉండాలని పార్టీ ముఖ్యులు తమ సభ్యులకు సూచిస్తున్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్పాయి. యూరియా కొరతపై కేంద్రం వివక్షతను చూపిస్తోందని అనేక వేదికలపైన కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. ఈ అంశంపై కూడా కేంద్రం తీరును నిరసించాలని హస్తం నేతలు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కారు రేసు, కవిత బీఆర్ఎస్ పైన చేస్తున్న విమర్శలు కూడా సభలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయని, వాటిపైన విపక్ష పార్టీలను ప్రశ్నించే అవకాశాలున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.






