గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా తెలంగాణ

by Ajay Maddhiboyina |

సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ అత్యంత అనుకూలమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని కోరారు.

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా తెలంగాణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ అత్యంత అనుకూలమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని కోరారు. మలేషియా–పెనాంగ్ డిప్యూటీ సీఎం వైబీ జగదీప్ సింగ్ దియో నేతృత్వంలోని ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. తెలంగాణ-మలేషియా (పెనాంగ్) మధ్య సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఏఐ, ఇన్నోవేషన్స్, హ్యూమన్ క్యాపిటల్ డెవలెప్‌మెంట్ తదితర రంగాల్లో పరస్పర సహకారానికి గల అవకాశాలపై ఈ భేటీలో చర్చించారు.

చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, అధునాతన సాంకేతిక రంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా ఎదుగుతోందని మంత్రి శ్రీధర్ బాబు వారికి వివరించారు. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, ఏరో స్పేస్, డిఫెన్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. "తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. ఇరు ప్రాంతాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేలా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకెళ్తాం" అని వైబీ జగదీప్ సింగ్ దియో పేర్కొన్నారు.

Next Story