గ్రామాల్లోనే ఇకపై ఉచిత వైద్య పరీక్షలు!

by Naga Rani Yarlagadda |

సాధారణ రక్త పరీక్ష కోసమో, చిన్నపాటి ఆరోగ్య సమస్య కోసమో పల్లెవాసులు ఇకపై మైళ్ల కొద్దీ ప్రయాణించి పట్టణాలకు పరుగెత్తాల్సిన అవసరం లేదు.

గ్రామాల్లోనే ఇకపై ఉచిత వైద్య పరీక్షలు!
X
  • ఆరోగ్య శాఖకు రూ. 740 కోట్లు విడుదల
  • 1,569 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణం.. పల్లెల్లోనే ల్యాబ్ సేవలు

దిశ, తెలంగాణ బ్యూరో: సాధారణ రక్త పరీక్ష కోసమో, చిన్నపాటి ఆరోగ్య సమస్య కోసమో పల్లెవాసులు ఇకపై మైళ్ల కొద్దీ ప్రయాణించి పట్టణాలకు పరుగెత్తాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని వారి ఇంటి ముంగిటకే చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పల్లెల్లో ప్రాథమిక వైద్య రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ఏకంగా రూ.740 కోట్ల నిధులను విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం ఈ మేరకు నిధుల విడుదలకు సంబంధించిన జీవోను జారీ చేశారు.

రూ.740 కోట్లతో ఏం చేయబోతున్నారు?

నిధుల లేమితో అరకొర వసతులతో ఉన్న పల్లె వైద్యానికి కొత్త కళ తీసుకురానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 1,569 కొత్త ఆరోగ్య ఉప కేంద్రాల (సబ్ సెంటర్లు) భవన నిర్మాణాలను ఈ నిధులతో చేపట్టనున్నారు. ప్రాథమిక ఆరోగ్య స్థాయిలోనే వ్యాధులను త్వరగా గుర్తించేందుకు వీలుగా స్థానిక సబ్ సెంటర్లలోనే ఉచిత నిర్ధారణ (డయాగ్నోస్టిక్) సేవలను అందుబాటులోకి తేనున్నారు.

ప్రైవేట్ దోపిడీకి చెక్.. పేదలకు ఊరట

చిన్నపాటి నిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించి జేబులు ఖాళీ చేసుకుంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కానుంది. వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించి సత్వర చికిత్స అందించడం ద్వారా పల్లె ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించనుంది. వైద్యాన్ని పేద ప్రజల ప్రాథమిక హక్కుగా మారుస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయం గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ స్వరూపాన్నే మార్చబోతోంది.

Next Story