క్యాన్సర్‌ను నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించలేమన్న కేంద్రం

by Naga Rani Yarlagadda |

వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు నమోదయింది.

క్యాన్సర్‌ను నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించలేమన్న కేంద్రం
X
  • లోక్‌సభలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి ప్రశ్నకు కేంద్రం

దిశ, తెలంగాణ బ్యూరో: క్యాన్సర్‌ను జాతీయ స్థాయిలో నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించే ఆలోచన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో నాగర్‌కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాధవ్ శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సాధారణంగా వ్యాధులను నోటిఫైడ్ (తప్పనిసరిగా నివేదించాల్సినవి)గా ప్రకటించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.. తక్షణమే కేసుల విచారణ, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ వంటి అత్యవసర ప్రజారోగ్య చర్యలు చేపట్టడమేనని మంత్రి వివరించారు. ఇటువంటి నిబంధనలు అంటువ్యాధులు, అత్యవసర ఆరోగ్య సమస్యల విషయంలో మాత్రమే అవసరమవుతాయని చెప్పారు. క్యాన్సర్ అనేది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించని (నాన్-కమ్యూనికేబుల్) వ్యాధి అయినందున, దీనిని నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించడం వల్ల ఎలాంటి ప్రత్యేకాంశం సిద్ధించదని పేర్కొన్నారు. అయితే, దేశంలో క్యాన్సర్ విస్తృతిని అంచనా వేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (ఎన్సీఆర్పీ) ద్వారా పటిష్టమైన డేటాను సేకరిస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు. ప్రజారోగ్య చట్టాలు రాష్ట్రాల పరిధిలోని అంశమని, తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాలు తమ సొంత పరిధిలో క్యాన్సర్‌ను నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించాయని గుర్తుచేశారు. అయా రాష్ట్రాలకు సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం నిరంతరం అందిస్తుందని తెలిపారు.

Next Story