- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఏసీబీ సరికొత్త రికార్డు.. 1983 తర్వాత మళ్లీ రిపీట్
అత్యధికంగా కేసుల నమోదుతో తెలంగాణ సరికొత్త రికార్డు నమోదు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) తన చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2026 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) అత్యధిక కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా ఐపీఎస్ వెల్లడించారు. 1983 తర్వాత ఒక త్రైమాసికంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు చేయడం ఇదే తొలిసారని ఆమె తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో 2026 రెండో త్రైమాసికంలో నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతిని డీజీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఏసీబీ పనితీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూ, 1983 తర్వాత ఇదే త్రైమాసికంలో అత్యధిక కేసులు నమోదు కావడం సంస్థ అవినీతిపై దృష్టి, నిరంతర అప్రమత్తత, అధికారుల వృత్తి నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.
అధికారులకు రివార్డులు:
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఏసీబీ అధికారులు, సిబ్బంది కృషిని చారు సిన్హా అభినందించారు. పారదర్శక పాలన, సమిష్టి పనితీరు, వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించిన అధికారులను ప్రశంసించారు. అవినీతి రహిత, పారదర్శక పాలన అందించడంలో అంకితభావంతో పనిచేసిన అధికారులను, సిబ్బందిని ప్రోత్సహించేందుకు ఏసీబీ విభాగంలో ప్రత్యేకంగా 'రివార్డ్ మేళా' (Reward Mela) నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు డీజీ చారు సిన్హా ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో మాట్లాడిన చారు సిన్హా.. అవినీతి దేశాన్ని లోపల నుంచే బలహీనపరుస్తుందని పేర్కొన్నారు.
ప్రజల విశ్వాసం నిలబెట్టుకోవాలి:
అధికారులు నిజాయితీ, సంకల్పంతో ప్రజా బాధ్యతను నిర్వర్తించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని, చట్ట పాలనను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఏసీబీ ప్రాధాన్యత ఎల్లప్పుడూ వృత్తిపరమైన, నిష్పాక్షిక, సమగ్ర దర్యాప్తు లేనని, నిరంతర శిక్షణ, దర్యాప్తు ప్రమాణాల మెరుగుదల, సంస్థాగత అప్రమత్తత ద్వారా అవినీతి నిరోధక చర్యలను మరింత బలోపేతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. అవినీతిని అరికట్టేందుకు మరింత సమర్థంగా పనిచేస్తూ, నిజాయితీ, జవాబుదారీతనం, సుపరిపాలన పరిరక్షణలో ఏసీబీ ముందంజలో ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.






