- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖాళీగా ఉన్న కమిషనర్ పోస్టుకు ఫుల్‌టైమ్ బాస్.. బల్దియాలో కొత్త ఆశలు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా తేజావత్ వెంకన్న నాయక్‌ను ప్రభుత్వం నియమించింది.

దిశ, వరంగల్ బ్యూరో: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా తేజావత్ వెంకన్న నాయక్‌ను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఐఏఎస్ ల బదిలీలతో పాటు మున్సిపల్ కమిషనర్ల బదిలీలో భాగంగా హైదరాబాద్ మెట్రో కోర్ జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న వెంకన్నను వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ గా బదిలీ చేశారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే సంబంధిత పోస్టుల్లో చేరాలని ఆదేశాలు ఇచ్చారు. గ్రూప్-1 అధికారిగా 2007లో మున్సిపల్ కమిషనర్ గా ఎన్నికైన తేజావత్ వెంకన్న నాయక్ జీహెచ్ఎంసీ పరిధిలో సౌత్ జోనల్ కమిషనర్ గా, హెచ్ఎండీఏ పరిధిలో జాయింట్ కమిషనర్ గా పనిచేశారు. జిల్లాకు చెందిన ఆయనను తొలిసారిగా వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ గా నియమించారు. మొదటి సారిగా ఐఏఎస్ లను కాదని మున్సిపల్ శాఖలో దాదాపు 19 ఏళ్ల సర్వీసు ఉన్న వెంకన్నను నియామకం చేశారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పోస్ట్ మూడు నెలలుగా ఖాళీగా ఉంది. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఇన్‌ఛార్జ్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఆమెను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. కొత్త కమిషనర్ గా నియమితులైన వెంకన్న ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.
కొత్త కమిషనర్ కు అన్నీ సవాళ్లే..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రస్తుతం పాలకవర్గం లేదు. వర్షాకాలం ఆరంభం సమయంలో ఆయనను ప్రభుత్వం కొత్త కమిషనర్ గా నియమించింది. గత సంవత్సరం భారీ వర్షాలకు నగరం పరిధిలో భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. వేలాది మంది ఇండ్లు మునిగిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. చెరువు తెగి నాళాలు మునిగి వరదనీరు ఇండ్లను ముంచెత్తింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నామమాత్రం పనులే చేశారు. మళ్లీ భారీ వర్షాలు పడితే ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుంచి ఇతర అభివృద్ధి పనుల వరకు నత్తనడకనే సాగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ లో 66 డివిజన్లు ఉన్నా సమస్యలు భారీగానే ఉన్నాయి. మున్సిపల్, శానిటేషన్, ఇంజినీరింగ్, రెవెన్యూ, ప్రణాళిక, టౌన్ ప్లానింగ్ విభాగాలతో పాటు ఇతర విభాగాల్లో కీలక సమస్యలు ఉన్నాయి.
పాతుకుపోయిన ఉద్యోగులు ప్రజాప్రతినిధుల పట్టుతో కొనసాగుతుంది. పలు పనులు పెండింగ్ లో ఉండగా భద్రకాళి ట్యాంక్ బండ్ తో పాటు ఇతర పనులు కొనసాగడం లేదు. శానిటేషన్ లో సిబ్బంది కొరతతో పాటు ఇతర ఇబ్బందులు ఉన్నాయి. మున్సిపల్ సర్వీసులో కీలక విభాగాల్లో పనిచేసిన వెంకన్న సమర్థుడు కావడంతో ప్రభుత్వం కమిషనర్ గా నియమించినట్లు తెలుస్తుంది. ప్రజాప్రతినిధుల పట్టు, మాజీ కార్పొరేటర్ల ఒత్తిళ్ల మధ్య కొత్త కమిషనర్ ఏ విధంగా నెట్టుకొస్తారో భవిష్యత్తులో తేలే అవకాశం ఉంది. కమిషనర్ నియామకంతో రాబోయే మున్సిపల్ ఎన్నికలు కూడా సజావుగా సాగే అవకాశం కనిపిస్తుంది.






