తెలంగాణ ఏర్పాటుపై తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు.. ఢిల్లీలో బీఆర్ఎస్ ఫిర్యాదు

by Ramesh Naini |

పార్లమెంట్ వేదికగా తెలంగాణ ఏర్పాటును ఉద్దేశించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

తెలంగాణ ఏర్పాటుపై తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు.. ఢిల్లీలో బీఆర్ఎస్ ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ వేదికగా తెలంగాణ ఏర్పాటును ఉద్దేశించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా అటు ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇటు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఢిల్లీలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా-పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ.. ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా అవమానపరిచారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆయనపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు శుక్రవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.

నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

మరోవైపు, తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్వీ) నేతలు ముట్టడికి ప్రయత్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని, అమరవీరుల త్యాగాలను కించపరిచేలా మాట్లాడిన తేజస్వి సూర్య తక్షణమే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ ముట్టడి సమయంలో అక్కడే ఉన్న బీజేవైఎం (బీజేపీ యువమోర్చా) నేతలకు, బీఆర్‌ఎస్వీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో బీజేపీ కార్యాలయం వద్ద పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్వీ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Next Story