Teenmar Mallanna: ఆ మాట చెప్తేనే కదా కాంగ్రెస్‍లో చేరాం.. అసెంబ్లీలో తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

శాసనమండలిలో తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

Teenmar Mallanna: ఆ మాట చెప్తేనే కదా కాంగ్రెస్‍లో చేరాం.. అసెంబ్లీలో తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేయడం లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు. బీసీల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని రూ.11 వేల 500 కోట్లు బీసీల కోసం బడ్జెట్‍లో కేటాయించినా ఇంకా రూ.9 వేల కోట్లు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. మరో రెండు నెలల్లో కొత్త బడ్జెట్ అమల్లోకి రాబోతోందని మరి ఈ రెండు నెలల సమయంలో ఈ 9 వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్స్ కోసం రూ.50 కోట్లు కేటాయిస్తే ఇందులో ఖర్చు చేసింది కేవలం రూ.4 లక్షలు మాత్రమే, రాజీవ్ యువ వికాసం కింద రూ.4,102 కోట్లు బీసీ యువత కోసం ఖర్చు చేస్తామని చెప్పి రూ.13 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి యేడాది 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్తేనే మేమంతా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరామని, బీసీలమంతా ఓట్లు వేశామన్నారు. ఐదేళ్లలో బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి నెరవేర్చే ప్రభుత్వమేనా ఇదేనా అని ప్రశ్నించారు.

త్వరలో బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశం: పొన్నం

మల్లన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి పొన్నం బడుగు, బలహీన వర్గాల అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీలకు చేసిన ఖర్చుల వివరాల విషయంలో ఇంకా కసరత్తు జరుగుతోందన్నారు. త్వరలోనే బడుగు బలహీన వర్గాల ప్రజాప్రతినిధులతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయబోతోందన్నారు. బీసీలకు అన్యాయం చేయబోమన్నారు. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

Next Story