తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-14 02:24:38  IST  )

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత‌పై తాజాగా మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత‌పై తాజాగా మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కవిత ప్రోద్బలంతోనే ఆమె అనుచరులు, కార్యకర్తలు తన కార్యాలయంతో పాటు తనపై దాడి చేశారంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపడు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమారు 50 మంది కవిత అనుచరులు మారణాయుధాలతో తనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. అదేవిధంగా బీసీ ఉద్యమ నాయకులకు రక్షణ కల్పించాలని తీన్మార్ మల్లన్న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

కాగా, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆదివారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఇటీవల జహీరాబాద్‌లో నిర్వహించిన బీసీ నేతల సమావేశంలో తీన్మార్‌ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జాగృతి కార్యకర్తలు మేడిపల్లిలోని క్యూ న్యూస్‌ కార్యాలయం‌పై దాడి పాల్పడ్డారు. సిబ్బందిని తోసివేసి ఫర్నిచర్‌తో పాటు కిటికీలను పూర్తిగా ధ్వంసం చేశారు. అక్కడే మల్లన్న తన ఛాంబర్లో ఉండగా.. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి దాడి చేశారు. ఈ క్రమంలో ఆయన కుడిచేతికి స్వల్ప గాయమైంది. దీంతో అప్రమత్తమైన ఆయన గన్‌మెన్ శ్రీనివాస్‌ తన తుపాకీతో ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.

సమాచారం అందుకున్న మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌ గోవిందరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే ఆందోళనకారులు కొందరు పరారయ్యారు. జాగృతి కార్యకర్త సాయి చేతికి గాయం కాగా హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జాగృతి యాదాద్రి జిల్లా అధ్యక్షుడు సందుపట్ల సుజిత్‌ రావు, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు అశోక్‌ యాదవ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తీన్మార్ మల్లన్నను చికిత్స నిమిత్తం ఘట్‌కేసర్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. తనపై దాడి చేయడమే కాకుండా.. తన గన్‌మేన్‌ చేతిలోని గన్ లాక్కొని తతను కాల్చేందుకు ప్రయత్నించారని మల్లన్న ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో గన్‌మేన్‌ గాల్లోకి కాల్పులు జరిపారని తెలిపారు.

Next Story