- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Teenmar Mallanna: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. కొత్త పార్టీపై తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన
కొత్త పార్టీపై తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. అలాగే స్థానిక ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అగ్రవర్ణపార్టీలు మా బీసీలకు ఎప్పటికైనా కిరాయి ఇండ్లేనని అతి త్వరలోనే మా బీసీ పార్టీ రాబోతున్నదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓ గుర్తు ఉన్నట్లే త్వరలోనే బీసీలకు కూడా ఓ గుర్తు రాబోతున్నదని అప్పుడు మా బీసీ ఓట్లు బీసీలకేనని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జేఏసీ పోటీ చేయబోతున్నదని బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి గెలిపించుకోవాలన్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బీసీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలోని బీసీలందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డల చేయిపట్టుకుని తెలంగాణలో బీసీలం అధికారంలోకి రాబోతున్నామని 2028లో తెలంగాణ రాష్ట్రానికి బీసీ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42 శాతం బీసీ రిజర్వేషన్లు అనే బెల్లాన్ని మోచేతికి పెట్టి నాకించే ప్రయత్నం చేస్తున్నారని.. బీసీ బిడ్డ తల్లి కడుపున పుట్టిన బిడ్డగా ఇవాళ చెప్తున్నాను మమ్మల్ని ఇన్నాళ్లు మోసం చేసిన అగ్రవర్ణ పార్టీలను గోల్కొండ కోట వరకు దేకియ్యకపోతే తన పేరు తీన్మార్ మల్లన్న కాదని సవాల్ విసిరారు.
జానారెడ్డి నీ బిడ్డలమీద ఒట్టేసి చెప్పగలవా?:
బీసీ కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలో చర్చ జరిగింది. ఆ మీటింగ్ కు నేను కూడా హాజరయ్యారు. ఆ మీటింగ్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎగ్గొడదామని చెప్పారు. నేను అక్కడే ఉన్నారు. ఈ మాట జానారెడ్డి అన్నారో లేదో తన ఇద్దరు బిడ్డల మీద ఒట్టేసి చెప్పాలని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. నేను నా బిడ్డల మీద ఒట్టేస్తానని సవాల్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా ఎగ్గొడదామని జానారెడ్డి చూస్తే నేను మా రిజర్వేషన్లు ఎట్లా ఎగ్గొడతావ్ బిడ్డా అని ప్రశ్నిస్తున్నానన్నారు. తీన్మార్ మల్లన్న ఒంటరి కాదని మల్లన్న వెనుక గ్రామ గ్రామాల బీసీ బిడ్డల అండ ఉందన్నారు. ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలను వేలివేసిన గ్రామాలు ఉన్నాయి కానీ ఎక్కడన్న రెడ్లను వేలివేశారా? కానీ తీన్మార్ మల్లన్న ఒక్కడే మీ ఓట్లు మాకు వద్దు అని వెలివేశాడని చెప్పారు. 30-40 ఏళ్లుగా బీసీ ఉద్యమాల్లో ఎక్కడైనా ఈ చర్చ జరగలేదు. తీన్మార్ మల్లన్న బయటకువచ్చి మాట్లాడుడు మొదలు పెట్టగానే తెలంగాణ రాష్ట్రం అంతా కుతకత ఉడుకుతోందని బీసీ బిడ్డలంతా చైతన్యవంతమవుతున్నారన్నారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీసీలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ముదిరాజులు బీసీ ఉద్యమానికి పెద్దన్నపాత్ర వహించాలన్నారు. రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకువచ్చి ప్రతి బీసీ ఇంటికి రెండెకరాల భూమి పట్టా పత్రాన్ని అందివ్వబోతున్నామని ప్రకటించారు. పీవీ నర్సింహారావు తీసుకువచ్చిన ల్యాండ్ సీలింగ్ ఫైల్ ను మళ్లీ కదిలించబోతున్నాం. మా పేద వర్గాల ప్రజలకు ఇంటికి రెండెకరాల భూమి పంచే అవకాశం ఉందన్నారు.
కవితకు ఏం సంబంధం?:
బీసీల రిజర్వేషన్లకు జాగృతి అధ్యక్షురాలు కవితకు ఏం సంబంధం అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇస్తామంటే ఎమ్మెల్సీ కవిత రంగులు పూసుకుని సంబరాలు చేసుకుంటోందని ఆమె తీరు దున్నపోతు ఈనితే దుడ్డెను కట్టేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బీసీలకు రిజర్వేషన్లు వస్తే కవితకు ఏం సంబంధం మీకు బీసీలతో కంచం పొత్తు ఉందా అని ప్రశ్నించారు. బీసీలకు నిజంగానే 42 శాతం రిజర్వేషన్లు వస్తే మా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు పండగ చేసుకోవాలి కానీ మీరు పండగచేసుకోవడం ఏంటో మాకు అర్థం కావడం లేదన్నారు. 70 ఏళ్లకు పైగా మమ్మల్ని దొక్కి చిత్రహింసలకు గురి చేసి ఈ భూమ్మిద మీకు కూడే లేదని వెళ్లగొట్టిన మీ జాతి పండగచేసుకోవడం ఏందో మాకర్థం కాలేదన్నారు. కవిత తీరు చూసిన వాళ్లంతా నవ్వుకుంటున్నారని బీసీలకు ఈమెకేమని సంబంధం అనుకుంటున్నారన్నారు.
హాట్ టాపిక్ గా మల్లన్న బీసీ ప్రమాణం:
ఈ సందర్భంగా సభకు హాజరైన వారితో తీన్మార్ మల్లన్న ప్రమాణం చేయించడం హాట్ టాపిక్ గా మారింది. 'తెలంగాణ రాష్ట్రంలో బీసీలమైన మేము మన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులను కలుపుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నిలబడితే బీసీ అభ్యర్థికి తప్ప ఓసి అభ్యర్థికి ఓటు వేయనని నా సోదరులైన ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో వారికి మాత్రమే ఓటు వేస్తామని బీసీ తల్లి పాలు తాగిన బిడ్డగా ప్రమాణం చేస్తున్నాను' అంటూ సభీకుల చేత ప్రమాణం చేయించారు.






