Teenmar mallanna: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పేరు ఇదే

by Prasad Jukanti |   (  Updated:2025-09-17 10:13:47  IST  )

తెలంగాణలో కొత్త పార్టీ పురుడు పోసుకుంది.

Teenmar mallanna: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పేరు ఇదే
X

డైనమిక్ బ్యూరో:తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. బంజారాహిల్స్ తాజ్ కృష్ణా వేదికగా ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’.. (టీఆర్‌పీ) పేరుతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీని ప్రకటించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. కార్మికుల కష్టానికి, కార్మికుల రక్తానికి గుర్తుగా జెండాలో ఎరుపు రంగు, రైతులు పండించిన పంటలకు, రైతుల కష్టానికి గుర్తుగా ఆకుపచ్చ రంగును జెండాలో పొందుపరిచారు. జెండా మధ్యలో రెండు ఆలీవ్ ఆకులు, దాని మధ్యలో కార్మిక చక్రం, ఆ చక్రంలో నుంచి బిగించిన పిడికిలి గుర్తుతో జెండాను రూపొందించారు జెండాపై ‘ఆత్మగౌరవం, అధికారం, వాటా’ అనే నినాదాలు రాశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. తెలంగాణ జనం పిడికిలి బిగించి అధికారం కోసం ముందుకు వెళ్తున్నట్లుగా జెండాపై పిడికిలి గుర్తు ఉంచామన్నారు. కార్మికులు, కర్షకుల చేత ప్రారంభించబడుతున్న పార్టీ ఇది అని పేర్కొన్నారు. బీసీల అస్తిత్వం, ఆత్మగౌరవం, వాటా కోసం ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నామని తెలిపారు.

బీసీలను అసెంబ్లీలో కూర్చోబెడతా : తీన్మార్ మల్లన్న

ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటే ఇక్కడి ఓ ఆధిపత్య కుల అధికారి తెల్లవారుజామునుంచే ఫ్లెక్సీలను చింపేశారని ఆరోపించారు. అయితే అస్తిత్వంపై దెబ్బ కొడుతున్నవారి అహంకారాన్ని ఓట్ల ద్వారా అణిచివేస్తామని మల్లన్న ప్రకటించారు. దేశచరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అధికార పార్టీ ప్రతినిధిగా టీఆర్పీ పార్టీ నియమించిందని చెప్పారు. అసెంబ్లీ మెట్లు ఎక్కని బీసీలను శాసనసభలో కూర్చోబెడతానని, బీసీలు గాంధీ భవన్, బీజేపీ ఆఫీస్, తెలంగాణ భవన్ దగ్గర బీ ఫామ్ కోసం వేచి చూసే రోజులకు ఇక స్వస్తి అని అన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో టీఆర్పీ పోటీ చేస్తుందన్నారు.

పార్టీ ప్రకటనకు ముందు హైడ్రామా:

టీఆర్పీ పార్టీ ప్రకటించేందుకు ముందు రాజకీయ హైడ్రామా నడిచింది. బీసీ నినాదంతో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు చాలా కాలంగా తీన్మార్ మల్లన్న చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇదివరకే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఉనికిలో ఉన్న బీసీయూఎఫ్ బాధ్యతలు స్వీకరించి ప్రజల్లోకి వెళ్లబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈక్రమంలో ఇవాళ మల్లన్న సైతం తన రాజకీయ వేదిక బీసీయూఎఫ్ అనే ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా టీఆర్పీ పేరును తెరపైకి తీసుకు రావడం రాజకీయంగా కొత్త చర్చకు దారి తీసింది. ఈ పార్టీ ప్రకటనకు ముందు బీసీయూఎఫ్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తీన్మార్ మల్లన్న బీసీయూఎఫ్ లో చేరారారని ఆయనను మా జాతీయ అధ్యక్షుడు నేషనల్ ఎగ్జిక్యూటీవ్ ప్రెసిడెంట్ గా నియామక పత్రం సైతం ఇచ్చారని బీసీయూఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తీన్మార్ మల్లన్న మా జాతీయ అధ్యక్షుడు ఇంటికి కూడా చాలా సార్లు వచ్చి వెళ్లారని చెప్పారు. ఇంతలో బీసీయూఎఫ్ ను కాదని టీఆర్పీ పేరుతో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. దీంతో బీసీయూఎఫ్ విషయంలో ఏం జరిగిందనే చర్చ ఆసక్తిగా మారింది.

Next Story