- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌కు టెక్ బూస్ట్.. 104 ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు కేంద్రం మద్దతు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
భారతీయ ఐటీ రంగం కేవలం సాఫ్ట్‌వేర్ సేవలకే పరిమితం కాకుండా, గ్లోబల్ మార్కెట్‌లో తనకుకున్న నమ్మకాన్ని అందిపుచ్చుకుంటూ "ఏఐ యాజ్ ఎ సర్వీస్" మోడల్ వైపు రూపాంతరం చెందాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భారతీయ ఐటీ రంగం కేవలం సాఫ్ట్‌వేర్ సేవలకే పరిమితం కాకుండా, గ్లోబల్ మార్కెట్‌లో తనకుకున్న నమ్మకాన్ని అందిపుచ్చుకుంటూ "ఏఐ యాజ్ ఎ సర్వీస్" మోడల్ వైపు రూపాంతరం చెందాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిర్వహించిన 'వికసిత్ భారత్ 2047- సాంకేతికత పాత్ర' ఇండస్ట్రీ లీడర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా భాగస్వామ్యమయ్యారు.
12 సెమీకండక్టర్ ప్లాంట్లు..
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 1960ల నుంచి దేశంలో సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, మోదీ ప్రభుత్వ కృషితోనే అది ఇప్పుడు సాకారమైందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 సెమీకండక్టర్ తయారీ ప్లాంట్లు వివిధ దశల్లో ఉన్నాయని, అందులో 3 పరిశ్రమల నుంచి ఇప్పటికే చిప్స్ ఉత్పత్తి అయి జపాన్, యూరప్ దేశాలతో పాటు దేశీయ మార్కెట్‌కు ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించేందుకు నాస్కామ్ భాగస్వామ్యంతో ప్రత్యేక ఏఐ కరికులమ్‌ను రూపొందించి విద్యాశాఖ, ఏఐసీటీఈకి అందించినట్లు చెప్పారు. అలాగే 315 విశ్వవిద్యాలయాలకు అధునాతన సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు.
తెలంగాణలో 104 కంపెనీలు
గత ఏడాది దేశీయ ఎగుమతుల్లో మొబైల్ ఫోన్లు అగ్ర స్థానంలో నిలిచాయని, ప్రస్తుతం రూ.13 లక్షల కోట్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక రంగం త్వరలోనే రూ.20 లక్షల కోట్లకు చేరుకోనుందని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ రంగానికి కేంద్రం పెద్దపీట వేసిందని, రాష్ట్రంలో 4 ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్‌తో పాటు ఏకంగా 104 ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక కంపెనీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని స్పష్టం చేశారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగిందని, యూపీఐ ద్వారా ఇప్పటివరకు రూ.314 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని గుర్తుచేశారు.
తెలంగాణ రైల్వేకు రూ.5,400 కోట్లు.. 40 స్టేషన్లు
గత యూపీఐ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్‌లో ఏటా కేవలం రూ.880 కోట్లు మాత్రమే కేటాయించేవారని, కానీ ఇప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్రానికే రూ.5,400 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నామని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. దేశవ్యాప్తంగా 1,300 స్టేషన్ల ఆధునీకరణలో భాగంగా తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' కింద అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్న ట్లు చెప్పారు. హైదరాబాద్ నగరం సెమీకండక్టర్, ఏఐ, కవచ్ టెక్నాలజీ, వీఎఫ్ఎక్స్ రంగాల్లో అగ్రగామిగా ఎదుగుతోందన్నారు. అలాగే నగరానికి 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్లాన్ చేశామని పునరుద్ఘాటించారు.
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరించాలి: కిషన్ రెడ్డి
అభివృద్ధి కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా వరంగల్, కరీంనగర్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాలని, అక్కడ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, 100% రైల్వే విద్యుదీకరణ పనులు హైదరాబాద్ వృద్ధికి మరింత ఊతమిస్తాయన్నారు. కాగా, అంతకుముందు కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డిలు కొండకల్‌లోని మేధా బోగీస్ ఫ్యాక్టరీని, ఫ్యాబ్ సిటీ రోడ్డులోని మేధా సెర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను సందర్శించారు. అక్కడ తయారీ కార్యకలాపాలు, సాంకేతిక సామర్థ్యాలు, భద్రతా ప్రమాణాలను పరిశీలించి ఉద్యోగులతో ముచ్చటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.






