సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు సింగరేణి గుడ్ న్యూస్..

by Ramesh Naini |

రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) శుభవార్త చెప్పింది.

సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు సింగరేణి గుడ్ న్యూస్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం నుంచి సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది కూడా 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం' పథకాన్ని కొనసాగిస్తున్నట్లు సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై, మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన తెలంగాణ ప్రాంత అభ్యర్థుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సింగరేణి సంస్థ తరఫున రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హత సాధించిన ప్రతి అభ్యర్థికి ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ www.scclmines.com ను సందర్శించవచ్చని సూచించారు. సింగరేణి అందిస్తున్న ఈ ఆర్థిక ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకుని, ఈ ఏడాది మరింత ఎక్కువ మంది తెలంగాణ యువత సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించాలని, రాష్ట్రానికి, దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆకాంక్షించారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యతగా పథకం..

రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో యువత సివిల్ సర్వీసెస్‌లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు సీఎండీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా 2024 లో ఈ పథకాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైందని వివరించారు.

గత రెండేళ్ల విజయాలు ఇవే..

'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకం ద్వారా గత రెండేళ్లలో మొత్తం 346 మంది అభ్యర్థులకు సింగరేణి సంస్థ ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించిందని సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 2024లో తొలి ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన 140 మంది అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున సాయం అందించారు. వారిలో 20 మంది ఇంటర్వ్యూకు ఎంపికవగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి మరో రూ. లక్ష చొప్పున అదనపు ప్రోత్సాహకం ఇచ్చారు. ఫలితంగా వీరిలో ఏడుగురు సివిల్ సర్వీసెస్‌లో విజేతలుగా నిలిచారు. 2025 లో గత ఏడాది ఈ పథకం కింద 206 మంది అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహకం అందించారు. వారిలో 50 మంది ఇంటర్వ్యూకు ఎంపిక కాగా, తుది ఫలితాల్లో 20 మంది సివిల్స్ సాధించారు.

Next Story