ఒక్క ఇంచు ఆక్రమణ ఉన్నా కూల్చి వేయండి! మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

by Geesa Chandu |

ఖమ్మం నగరంలో ఒక్క ఇంచు నేను ఆక్రమణ చేసినట్లు ఉన్నా కూల్చివేయండి అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

ఒక్క ఇంచు ఆక్రమణ ఉన్నా కూల్చి వేయండి! మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మం నగరంలో ఒక్క ఇంచు నేను ఆక్రమణ చేసినట్లు ఉన్నా కూల్చివేయండి అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. నా హాస్పిటల్ కు మున్నేరుకు సంబంధం లేదని, హాస్పిటల్ నిర్మించి 25 సంవత్సరాలు అయిందని వెల్లడించారు. ఇంత వరద వచ్చినా నా హాస్పిటల్ కు చుక్క నీరు రాలేదని తెలిపారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారని ప్రజలు భావిస్తున్నారన్నారు. మున్నేరు వరద భాదితులను ఆదుకునేందుకు వెళ్తే మాపైన కాంగ్రెస్ నేతలు దాడి చేశారన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులకు వాయిస్ లేదని తెలిపారు. మున్నేరుకు వరద ఎక్కడి నుండి వస్తుందో సీఎం రేవంత్ రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మహబూబాబాద్ వెళ్లి నాపై దాడి చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అజయ్ కుమార్ ఆక్రమణల వలనే ఖమ్మం మునిగిందని సీఎం పేర్కొనడంలో వాస్తవం లేదన్నారు. మున్నేరు పరివాహకంలో రాజీవ్ గృహకల్ప, జలగం నగర్ కాలనీలు నిర్మించిందే కాంగ్రెస్ ప్రభుత్వమే అని వివరించారు. మున్నేరుకు రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని, ఆదివారం ఉదయం నాటికి 33 అడుగులు నీరు వచ్చిందని తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు రేవంత్ రెడ్డి వ్యవహరించారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలా పని చేశామో ప్రజలకు తెలుసు అన్నారు.

ప్రజలను డైవర్ట్ చేసేందుకే మాపై దాడులు చేశారన్నారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ప్రజల ప్రాణాలను ప్రజలే కాపాడుకున్నారన్నారు. మున్నేరుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ కావాలని 650 కోట్లు మంజూరు చేయించానని వెల్లడించారు. రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టడం లేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. భౌతికంగా మాపై దాడి చేస్తే ఖమ్మం ప్రజల భాదలు తీరుతాయా.?అని ప్రశ్నించారు. మంత్రుల ఫంక్షన్ హాల్స్ ఆక్రమణలో ఉన్నాయని ఖమ్మం ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఓ మంత్రి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని, మరో మంత్రి విల్లాలు వక్ఫ్ బోర్డు భూముల్లో ఉన్నాయని ఆరోపించారు. హైడ్రాను మంత్రుల ఫంక్షన్ హాళ్లు, విల్లాలతో మొదలు పెట్టండి అని సూచించారు. సాయం చేయాలని వెళ్తే కాంగ్రెస్ నేతలు మాపై దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు మనుషులే మాపై దాడి చేశారని ఆరోపించారు. మున్నేరుకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

Next Story