- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్లెల ప్రగతికి 'టీమ్ వర్క్' మంత్రం.. 7 గంటల పాటు సాగిన సీతక్క సమీక్ష
విడివిడిగా పని చేస్తే ఫలితాలు రావు, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు ఒకే టీమ్‌గా పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : విడివిడిగా పని చేస్తే ఫలితాలు రావు, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు ఒకే టీమ్‌గా పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని, ప్రతి గ్రామానికి అవసరాలు, వనరులు, సమస్యలను గుర్తించి వాటి ఆధారంగా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామాల అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు నిర్మించడం మాత్రమే కాదని, గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే అసలు అభివృద్ధి అని పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో మంగళవారం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీఆర్‌డీఓలు, డీపీఓలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, మిషన్ భగీరథ, సెర్ప్, ఉపాధి హామీ పథకం తదితర విభాగాల అధికారులతో మంత్రి సీతక్క సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యా దేవరాజన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దాదాపు ఏడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో శాఖల వారీగా పనుల పురోగతి, భవిష్యత్తు లక్ష్యాలపై మంత్రి సమీక్షించారు.
అన్ని గ్రామాలను గంగదేవిపల్లిలా చేయొచ్చు..
గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల పరిధిలో సుమారు 1.35 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, ఏటా రూ.34 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చవుతున్నాయని మంత్రి సీతక్క వివరించారు. ఇంత సిబ్బంది, నిధులు ఉన్నా గ్రామాల అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నారు. తెలంగాణలోని గ్రామాల్లో అపారమైన సహజ, మానవ వనరులు ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగిస్తే గంగదేవిపల్లి వంటి ఆదర్శ గ్రామాలను రాష్ట్రవ్యాప్తంగా తయారు చేయవచ్చని స్పష్టం చేశారు. గ్రామాలకు వచ్చే ప్రతి రూపాయి ప్రజల ప్రయోజనాలకే ఖర్చు కావాలన్నారు. కొన్నిచోట్ల గ్రామసభలు నిర్వహించకుండా నిధులు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.
జల సంరక్షణ ముఖ్యం..
గ్రామ స్థాయిలో భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన ‘జలసిరి’ అవగాహన పోస్టర్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకొని జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటలు, బావులు, వాగులను పరిరక్షించడం కీలకమన్నారు. పాత బావులను గుర్తించి పునరుద్ధరించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంటకుంట, ప్రతి ఊరిలో ఊటకుంటలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు సహా ప్రతి ఇంటికి నిరంతరాయంగా రక్షిత మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిషన్ భగీరథ నీటి నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
కేంద్రం సహకరించాలి..
ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మిస్తున్న రహదారులకు కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతుల సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. పట్టణాల్లో స్కైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తుంటే అటవీ గ్రామాల్లో కనీసం బీటీ రోడ్డు వేయడానికి అనుమతులు రావడం లేదన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేసిన తర్వాత కూడా అనుమతుల పేరుతో అడ్డంకులు సృష్టించడం వల్ల ఆదివాసీ గిరిజన గ్రామాలు ఇంకా వెనకబాటులోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 28, 29 తేదీల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో జరగనున్న సమావేశంలో ఈ సమస్యలను ప్రస్తావించనున్నట్లు తెలిపారు.
కష్టాలు మనకు తెలుసు..
'మనందరిదీ గ్రామీణ నేపథ్యమే. గ్రామీణ ప్రజల కష్టాలు మనకు తెలుసు. కాబట్టి గ్రామాల్లో సమస్యలు తలెత్తకముందే పరిష్కారాలు చూపాలి. తెలంగాణ గ్రామాలను దేశానికి ఆదర్శంగా నిలబెట్టే బాధ్యత మనందరిది' అని అధికారులకు మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మహిళా సంఘాల బలోపేతం, బ్యాంకు లింకేజీల పెంపు, మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సెర్ప్ అధికారులను మంత్రి ఆదేశించారు. మహిళల ఆర్థిక సాధికారత పెరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.






