జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

by Naga Rani Yarlagadda |

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2025కు పెద్దపల్లి జిల్లా నుంచి ఎంపికైన గడ్డం జగదీశ్వర్ ను శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీచర్స్ ఎంఎల్‌సీ మలక కొమురయ్య ఘనంగా సన్మానించారు.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2025కు పెద్దపల్లి జిల్లా నుంచి ఎంపికైన గడ్డం జగదీశ్వర్ ను శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీచర్స్ ఎంఎల్‌సీ మలక కొమురయ్య ఘనంగా సన్మానించారు. గురువారం హైదరాబాద్ లోని లక్డీకాపూల్ ప్రాంతంలో ఉన్న బిర్లా ప్లానిటోరియంలోని భాస్కరా ఆడిటోరియంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఉపాధ్యాయుడిగా జగదీశ్వర్ అందించిన సేవలను కొమురయ్య కొనియాడారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపలకల గ్రామానికి చెందిన జగదీశ్వర్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. జిల్లా ఇంగ్లీష్ రిసోర్స్ పర్సన్ గా రాణించారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో ఇంగ్లీష్ సబ్జెక్టుకు జిల్లా రిసోర్స్ పర్సన్ గా ఉన్నారు. రామగుండం మండలంలోని దుర్గయ్యపల్లిలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో ఆయన ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2025 అందుకున్న గడ్డం జగదీశ్వర్ కు జిల్లా స్థాయి అధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, సహచర ఉపాధ్యాయులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

జగదీశ్వర్ గురించి టీచర్స్ ఎంఎల్‌సీ మలక కొమురయ్య మాట్లాడుతూ.. ఆయన ఇంగ్లీష్ సబ్జెక్టును.. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తారని తెలిపారు. ఆయన బోధనలు ఇన్నోవేటివ్ గా ఉంటాయని, టెక్నాలజీ బోధనా వ్యూహాలను పాటిస్తూ.. సబ్జెక్టులో విద్యార్థులకు మంచి మార్గదర్శకత్వం వహిస్తారని కొనియాడారు. ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తూ.. తోటి టీచర్లను ప్రోత్సహిస్తారన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషనల్ వ్యూహాలను అమలు చేయాలని, ప్రభుత్వం లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా విద్యా ప్రణాళికలు రూపొందించాలని కోరారని తెలిపారు. పదేళ్లు ప్రైవేటు స్కూళ్లలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన జగదీశ్వర్.. 26 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విశిష్ట సేవలు అందిస్తున్నారని చెప్పారు. జగదీశ్వర్ ఎక్కడ పనిచేసినా సమయపాలన పాటిస్తూ, అంకిత భావంతో, దృఢదీక్షతో ఉంటారని తెలిపారు. కరోనా సమయంలోనూ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు, జూమ్ క్లాసులు నిర్వహించి జాతీయ స్థాయి కథల పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించారని, ఆయన ప్రోత్సాహంతో విద్యార్థులు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందుకున్నారని వివరించారు. కరోనా కాలంలో ఎన్.ఎం.ఎం.ఎస్. స్కాలర్షిప్ కోసం ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించి స్కాలర్ షిప్ వచ్చే విధంగా శిక్షణ ఇచ్చి సఫలీకృతులయ్యారు. సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ కోర్సెస్ అస్సాం రాష్ట్రంలోనీ గౌహతి, హైద్రాబాద్, రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లాంటి జాతీయ శిక్షణా కేంద్రాలలో ట్రైనింగ్ కొరకు ఎంపికయ్యారని తెలిపారు.

గతంలో జగదీశ్వర్ మండల, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్, ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అవార్డ్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రశంసలు, డాక్టర్ ఏ.పి.జే. అబ్దుల్ కలామ్స్ మిషన్ " లీడ్ ఇండియా ఫౌండేషన్ "నేషనల్ లెవల్ బెస్ట్ టీచర్ అవార్డ్", నేషనల్ యూత్ ప్రాజెక్ట్ వారి "గురు దేవో భవ" అవార్డ్, త్రేతా యుగ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విజనరి బెస్ట్ టీచర్ అండ్ మెంటార్ అవార్డ్, గ్రామీణ కళాజ్యోతి అవార్డ్, శాతవాహన కళా ఉత్సవాల సందర్భంగా ప్రశంసలు ఇలా అనేక అవార్డులు పొందారని పేర్కొన్నారు.

Next Story