తెలంగాణలోని 13 జిల్లాలో అధికంగా టీచర్ పోస్టులు ఖాళీ.. విద్యాశాఖ కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని పలు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. ఇటీవల జరిగిన పదోన్నతుల ప్రక్రియ వల్ల సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) ఉన్నత స్థానాలకు వెళ్లారు.

తెలంగాణలోని 13 జిల్లాలో అధికంగా టీచర్ పోస్టులు ఖాళీ.. విద్యాశాఖ కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పలు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. ఇటీవల జరిగిన పదోన్నతుల ప్రక్రియ వల్ల సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) ఉన్నత స్థానాలకు వెళ్లారు. దీంతో ప్రాథమిక విద్య బోధనలో అంతరాయం ఏర్పడుతున్నది. దాదాపు 3500 మంది ఎస్జీటీలు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎంలు), స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏలు) గా ప్రమోషన్ పొందారు. దీంతో ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి.

13 జిల్లాల్లో..

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో టీచర్ల కొరత ఎక్కువగా ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఆయా జిల్లాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల ఇతర సబ్జెక్టుల టీచర్లనూ ప్రైమరీ స్కూల్స్‌కు సర్దుబాటు చేయాల్సి వస్తున్నది. ఇప్పటికీ ఆదిలాబాద్, యాదాద్రి భువనగిరి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నిర్మల్, భూపాలపల్లి, జనగామ, కరీంనగర్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణ పేట జిల్లాల్లో సర్దుబాటు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మిగులు టీచర్ల సర్దుబాటు బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు. వారి నేతృత్వంలోనే ఈ ప్రక్రియంతా పూర్తి చేయాలి. స్కూళ్లలోని విద్యార్థుల సంఖ్య, కొత్త అడ్మిషన్లను ప్రామాణికంగా తీసుకుని సర్దుబాటును పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటగా జూన్ 13 వరకు పూర్తి చేయాలని చెప్పగా.. ఆ తర్వాత జులై 15 వరకు గడువు తేదీని పొడిగించారు. మొత్తంగా జులై 22లోపు టీచర్ల సర్దుబాటు పూర్తి చేసి ఆ నివేదికను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు సమర్పించాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ గడువు ముగిసినా చాలా జిల్లాల నుంచి నివేదికలు పాఠశాల విద్యా డైరెక్టరేట్‌కు అందలేదు. అయితే, ప్రాథమిక పాఠశాలల్లో 10 మంది విద్యార్థులకు ఒక టీచర్, 11 నుంచి 60 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు, 61 నుంచి 90లోపు విద్యార్థులు ఉంటే ముగ్గురు టీచర్లు ఉండాలి.

సర్దుబాటుపై హెచ్ఎంల విజ్ఞప్తి..

ఈ పరిస్థితిపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను సర్దుబాటు చేయాలని వారు విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తక్షణమే మిగులు ఉపాధ్యాయులను ఖాళీ అయిన పోస్టుల్లో సర్దుబాటు చేయడంతో పాటు ఖాళీలను భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కాగా, టీచర్ల సర్దుబాటు విషయంలో పలువురు టీచర్లు సుముఖంగా లేకపోవడం, వారు ఆయా ప్రాంతాలకే పరిమితమై ఉండటం వలన టీచర్ల సర్దుబాటు హెచ్ఎంలకు సవాలుగా మారుతోంది. పదోన్నతుల అనంతరం ఖాళీ అయిన ఎస్జీటీ పోస్టులను త్వరితగతిన భర్తీ చేయకపోతే ప్రాథమిక విద్య నాణ్యతపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story