ఫేస్ రికగ్నిషన్‌తో టీచర్ల హాజరు.. నేటి నుంచి అమల్లోకి..!

by Yella Dhawani Reddy |

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలు చేయనున్నారు.

ఫేస్ రికగ్నిషన్‌తో టీచర్ల హాజరు.. నేటి నుంచి అమల్లోకి..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి పెద్దపల్లి జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. రాష్ట్రంలోని స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ, లోకల్‌బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, యూఆర్ఎస్, సొసైటీ గురుకులాల్లో 1.20 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. దాదాపు అందరు టీచర్లు ఫోన్లలో స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఉంది. దీని ఆధారంగానే ఇటీవల నిర్వహించిన టీచర్ల ట్రైనింగ్ వివరాలను నమోదు చేశారు. గురువారం టీచర్లంతా ఈ యాప్‌లో వివరాలను, ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. హెడ్‌మాస్టర్ లాగిన్‌లో డీటెయిల్స్ ఎంట్రీ చేయనున్నారు. ఇప్పటికే ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్‌పై ఉన్నతాధికారులు డీఈఓలకు డెమో కూడా ఇచ్చారు.

పెద్దపల్లిలో సక్సెస్

ఉపాధ్యాయుల హాజరుకు ఫేషియల్ రికగ్నిషన్ పెద్దపల్లిలో విజయవంతమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయుల హాజరును మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నమోదు చేసేందుకు ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్ఆర్ఎస్) విధానం అమలులోకి నేటినుంచి 32 జిల్లాల్లో అందుబాటులోకి రానుంది. పెద్దపల్లి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా విజయవంతంగా అమలు చేసిన ఈ విధానాన్ని రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాలకు విస్తరించడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. పాఠశాల సమయానికి ముందే టీచర్లు హాజరవుతున్నారని, హాజరు శాతం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పాఠశాల ప్రాంగణంలో ఉంటేనే టీచర్ హాజరు నమోదు చేయడానికి వీలవుతుండడం ఈ యాప్ ప్రత్యేకతగా భావిస్తున్నారు. దీనివల్ల విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, రాష్ట్రవ్యాప్తంగా అమలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

రెండేళ్ల క్రితమే యాప్ రూపకల్పన

విద్యార్థులు టీచర్ల హాజరు కోసం దాదాపు రెండేళ్ల క్రితమే యాప్‌ను రూపొందించిన విద్యాశాఖ అప్పటి నుంచి విద్యార్థులకు అమలు చేస్తుంది. తాజాగా ఉపాధ్యాయులకు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏఐ సాంకేతికతో పనిచేసే ఈ యాప్‌ను పాఠశాల విద్యాశాఖ 2023 సెప్టెంబరులో రూపొందించింది. ముఖ గుర్తింపు నమోదుకు సంబంధించి కేవలం యాప్‌తోనే హాజరు నమోదు చేస్తారు. హెచ్ఎం లేదా ఉపాధ్యాయుడి వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి విద్యార్థుల ముఖంపై చూపితే హాజరు నమోదవుతుంది. ఒకే సారి 20 మంది వరకు చూపించి హాజరు తీసుకోవచ్చు.

Next Story