TDP: కేసీఆర్ ను రౌండప్ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ.. అదే బాటలో టీడీపీ?

by Prasad Jukanti |   (  Updated:2025-05-27 12:22:27  IST  )

మహానాడు వేదికగా తెలంగాణ టీడీపీ విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకోబోయే నిర్ణయం ఉత్కంఠగా మారింది.

TDP: కేసీఆర్ ను రౌండప్ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ..  అదే బాటలో టీడీపీ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు దేశం పార్టీ (TDP) పండగ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కడప వేదికగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న మహానాడు కన్నుల పండువలా మొదలైంది. 2024 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడు (Mahanadu) ను నభూతో.. అన్న రీతిలో ఏర్పాట్లు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి మరింత పకడ్బందీ ప్రణాళికతో మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యం కావడంతో మహానాడు తీర్మానాలు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీచ్ పై అందరి ఫోకస్ పడింది. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ అభివృద్ధి విషయంలో ఎలాంటి ప్రకటనలు ఉండబోతున్నాయనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో మహానాడు ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బాబు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ను ఉద్దేశించినవేనా అనే చర్చ గుప్పుమంటోంది.

గులాబీ బాస్ కు ఎర్త్?:

గత కొంత కాలంగా చంద్రబాబుకు (Chandrababu Naidu) కేసీఆర్ మధ్య రాజకీయ వైరం తెలుగు రాజకీయాల గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నవారికైనా తెలిసిపోతుంది. ఏ మాత్రం చాన్స్ దొరికినా ఈ రెండు పార్టీల శ్రేణుల మధ్య సోషల్ మీడియా వార్ రచ్చ ఓ రేంజ్ దాటిపోతోంది. ఈ క్రమంలో మహానాడు వేదికగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇరు పార్టీల మధ్య చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. మహానాడు తొలిరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో చూసినా టీడీపీ యూనివర్సిటీ నుంచి వెళ్లిన నాయకులే ఉన్నారని ఇది తెలుగు దేశం పార్టీ సత్తా అని అన్నారు. టీడీపీ చరిత్ర చింపేస్తే చిరిగిపోయేది కాదని టీడీపీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పార్టీ అని అన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాహానాడులో పాల్గొన్న పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసీఆర్ గతంలో 1980లలో తెలుగుదేశం పార్టీలో భాగంగా ఉన్నారు. ఆ సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ (KCR) తెలుగుదేశం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ 1983లో సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985-1999 మధ్య వివిధ పదవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీడీపీ నుంచి కేసీఆర్ బయటకు వచ్చి బీఆర్ఎస్ ను స్థాపించారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమం వేళ కేసీఆర్ అనాటి ఫొటో వైరల్‌గా మారింది. మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోదంటూ కేసీఆర్ ఉన్న ఫోటోను రౌండప్ చేసి టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కేసీఆర్ తెలుగుదేశం పార్టీ అనే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నుండి పుట్టిన నాయకుడేనని కామెంట్స్ చేస్తున్నారు.

టీటీడీపీ రీ ఎంట్రీ ప్లాన్!:

ప్రస్తుతం బీఆర్ఎస్ లో (BRS) అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చర్చ జరుగుతున్న వేళ టీడీపీ యూనివర్సిటీ నాయకులే మిగతా పార్టీలో ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యలు, మహానాడులో కేసీఆర్ పాల్గొన్న ఫోటో వైరల్ కావడం గులాబీ బాస్ విషయంలో జోరుగా చర్చ జరుగుతోంది. నిజానికి అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ ఇంటర్నల్ గా అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగా తాజాగా కవిత రాసిన లేఖ వ్యవహారంలో కాంగ్రెస్ (Congress), బీజేపీలు (BJP) బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను రౌండప్ చేస్తున్నాయి. ఈ ఇష్యూను తమకు అనుకూలంగా మలుచుకుని కారుపార్టీపైకి విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలుగు దేశం రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. ఇటువంటి తరుణంలో మహానాడులో తెలంగాణ శాఖ విషయంలో సైకిల్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు రాబోతున్నదనేది ఉత్కంఠ రేపుతున్నది. కవిత లేఖ అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లు కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెడితే కేసీఆర్ గతంలో తమ యూనివర్సిటీ విద్యార్థినే అనే టీడీపీ క్లయిమ్ చేసుకోవడం ద్వారా తెలంగాణలో తమ రీ ఎంట్రీ విషయంలో మరింత పక్కాగా ప్లాన్ చేస్తోందనే వాదన తెరపైకి వస్తోంది. మరో రెండు రోజుల పాటు మహానాడు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ విషయంలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయనేది వేచి చూడాలి.

Next Story