US Tariffs: దసరా పండగ వేళ అమెరికాలో ఉన్న తెలుగు వారికి కొత్త కష్టాలు.. ఆఫీస్ ల్లోనే మగ్గుతున్న పార్శిల్స్

by Prasad Jukanti |   (  Updated:2025-09-13 12:54:21  IST  )

అమెరికా టారిఫ్ ల కారణంగా పార్శిల్స్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

US Tariffs:  దసరా పండగ వేళ అమెరికాలో ఉన్న తెలుగు వారికి కొత్త కష్టాలు.. ఆఫీస్ ల్లోనే మగ్గుతున్న పార్శిల్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రంప్ సుంకాల దెబ్బతో అనేక రంగాల్లో అనిశ్చితి నెలకొంది. ఏకంగా 50 శాతం టారిఫ్ లు అమలు చేస్తుండటంతో ఈ భారం మన దేశానికి సవాలుగా మారింది. ఈ విషయంలో ఇప్పటికే ఏం జరగబోతున్నదనే చర్చ జరుగుతుండగానే తాజాగా ట్రంప్ ఎఫెక్టు జాబితాలో పార్సిళ్ల వంతు కూడా వచ్చి చేరింది. టారిఫ్ ల దెబ్బకు ఇప్పుడు యూఎస్ లో ఉన్న భారతీయులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. మన దేశం నుంచి అమెరికాకు వివిధ కొరియర్ సంస్థల ద్వారా వెళ్తున్న పార్సీళ్లకు అంతరాయం ఏర్పడింది. ఆ దేశానికి వెళ్తున్న పార్సిల్స్ కొరియల్ సంస్థల కార్యాలయాల్లోనే మగ్గుతున్నాయి.

15 రోజులుగా కొరియర్ ఆఫీసుల్లోనే పార్సిల్స్:

టారిఫ్ ల నేపథ్యంలోనే ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని కోరియర్ సంస్థలు వినియోగదారులకు వివరిస్తున్నాయి. ఇక్కడి నుంచి వెళ్తున్న పార్సిళ్లకు కస్టమ్స్ అధికారుల నుంచి క్లియరెన్స్ లో జాప్యం వల్ల సమస్య మరింత పెరిగిందని, గడిచిన 15 రోజులుగా అనేక మంది పార్శిల్స్ కొరియర్ సంస్థల కార్యాలయాల్లోనే మగ్గిపోతున్నాయి. యునైటెడ్ పార్సిల్స్ సర్వీస్ (యూపీఎస్) లో తనకు వచ్చిన పార్సిల్ ను ట్రాక్ చేయగా 'అసౌకర్యానికి క్షమించండి. మీరు పంపినవారైతే, దయచేసి రిసీవర్‌ను సంప్రదించి డెలివరీ జరిగిందో లేదో నిర్ధారించుకోండి. లేనిపక్షంలో సమస్య పరిష్కారానికి మీరు క్లెయిమ్ ప్రారంభించవచ్చు' అంటూ సందేశాలు వస్తున్నాయి. పార్శిల్స్ స్తంభించిపోవడంతో తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులకు, స్నేహితులకు, బంధువులకు పంపిన పార్సిల్లు అన్నీ కొరియర్ కార్యాలయంలోనే నిలిచిపోవడంతో ఆ పార్శిల్స్ కోసం ఇక్కడ పంపిన వారు అక్కడ రిసీవ్ చేసుకునేవారికి ఎదురుచూపులు తప్పడం లేదు. దీంతో రానున్న దసరా పండుగ నేపథ్యంలో తమ వాళ్లకు పిండి వంటలు స్వీట్లు, బట్టలు, మందులతో పాటు వివిధ రకాల వస్తువులను పంపిన వారంతా తాజా పరిస్థితితో ఆందోళన చెందుతున్నారు.

Next Story