- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుమ్మిడిహట్టి To మేడిగడ్డ.. పొలిటికల్ మైలేజ్ కోసమే ‘ప్రాణహిత’ ఛేంజ్?
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించకుండా మేడిగడ్డకు తరలించిన విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించకుండా మేడిగడ్డకు తరలించిన విషయం తెలిసిందే. నీటి లభ్యత లేకపోవడం వల్లనే లొకేషన్ మార్చినట్టు బీఆర్ఎస్ పలుమార్లు చెప్పుకుంటూ వచ్చింది. కానీ.. పలువురు నీటి పారుదల నిపుణులు, సీడబ్ల్యూసీ నివేదికల ప్రకారం అదంతా అవాస్తవమని తేటతెల్లమవుతున్నది. అక్కడ నీటి లభ్యత ఉన్నప్పటికీ కావాలనే ప్రాజెక్ట్ లొకేషన్ మార్చారని స్పష్టం అవుతున్నది. రాజకీయ ప్రయోజనాల కోసమే గత ప్రభుత్వం ఇలా చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీలు..
బీఆర్ఎస్ చెబుతున్న మాటల్లో వాస్తవం ఎంతవరకు ఉన్నా.. నీటి పారుదల శాఖలోని పలువురు ఎక్స్‌పర్ట్స్ వెల్లడిస్తున్న వివరాలను పరిశీలిస్తే తుమ్మడిహెట్టి వద్ద సరిపడా నీటి లభ్యత ఉన్నట్లుగా వెల్లడైంది. ముఖ్యంగా ప్రాణహిత-చేవెళ్ల నిర్మాణానికి తుమ్మిడిహెట్టి వద్ద సీడబ్ల్యూసీ 1971-72 నుంచి 2011-12 వరకూ 41 ఏళ్ల పాటు డేటాను సేకరించిందని ఆ నివేదికలు చెబుతున్నాయి. డేటాను అధ్యయనం చేసి.. పెన్‌గంగా, వార్ధా, ప్రాణహిత ఉపబేసిన్ల నుంచి సగటున 10 రోజుల వారీగా నీటి ప్రవాహాలను లెక్కించింది. ఈ ప్రాజెక్టు కోసం 75 శాతం డిపెండెబిలిటీతో 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు 165 టీఎంసీల నీటి లభ్యతతో ఈ ప్రాజెక్టును సీడబ్ల్యూసీ సైతం ఆమోదించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ.. బీఆర్ఎస్ మాత్రం అక్కడ 63 టీఎంసీలే అందుబాటులో ఉంటాయని ఇటీవల నిర్వహించిన పీపీటీలో వెల్లడించింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ లేఖ రాసిందని చెప్పుకొచ్చారు. అందుకే.. లొకేషన్ మార్చినట్లు చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ చెబుతున్న లెక్కలకు.. ఎక్స్‌పర్ట్స్ నివేదికలకు పొంతన లేకుండా ఉంది. దాంతో లొకేషన్ మార్పుపై పలు అనుమానాలు ఉన్నాయి. కానీ, నిపుణుల లెక్కల ప్రకారం 63 టీఎంసీలే పొరుగు రాష్ట్రాలు వాడుకుంటే మనకు 100 టీఎంసీల వరకు అందుబాటులో ఉండేవని వెల్లడిస్తున్నాయి.
అసలు కథ ఇదీ..
తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి సామర్థ్యం ఉందని నిపుణుల లెక్కలు చెబుతున్నాయి.152 మీటర్ల ఎత్తులో నిర్మించుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని బీఆర్ఎస్ అంటున్నది. 148 మీటర్లలో నిర్మించుకునేందుకు అంగీకరించిందని చెబుతున్నది. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్లను మహారాష్ట్ర ఒప్పుకున్నట్లుగా 148 మీటర్ల ఎత్తులో నిర్మించుకున్నా నీటిని గ్రావిటీ ద్వారా అందించే ఆస్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు. హెడ్ రెగ్యులేటరీ కాలువల సామర్థ్యం పెంచి వాడుకోవచ్చని అంటున్నారు. గ్రావిటీల ద్వారానే ఎల్లంపల్లికి నీరు వచ్చి చేరుతుండేది. అవసరమైతే మధ్యలో ఎల్లంపల్లి వద్ద 20 మీటర్ల ఎత్తులో ఒక లిఫ్ట్ ఏర్పాటు చేస్తే నీరు ఎల్లంపల్లిలో వచ్చిచేరుతుండేది. బీఆర్ఎస్ మేడిగడ్డ వద్ద 240 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని చెబుతున్నప్పటికీ.. అందులో 165 టీఎంసీలు తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు చేరుకునేవే.
ఈ 165 టీఎంసీలతో కలుపుకుంటేనే మేడిగడ్డ వద్ద 240 టీఎంసీల నీటి లభ్యత అని బీఆర్ఎస్ చెబుతున్న లెక్కలు. కానీ.. ఏటా రాష్ట్రంలో నవంబర్ తరువాతనే నీటి వినియోగం అధికంగా ఉంటుంది. అప్పటివరకు నీటి లిఫ్టింగ్ కూడా అవసరం ఉండదు. అలాంటప్పుడు మేడిగడ్డ వద్ద 240 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా అంత మొత్తంలో వాడుకోలేం. నవంబర్ నుంచి వర్షాకాలం వచ్చే సమయానికి అంత మొత్తంలో నీటి వినియోగం జరగదు. అంతేకాకుండా.. కాళేశ్వరం నుంచి సమ్మక్క సాగర్‌కు నీళ్లు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ చెబుతున్నది. కానీ, సమ్మక్క సాగర్‌కు ఇప్పటికే 44 టీఎంసీల నీటి అలాట్‌మెంట్ ఉంది. అలాంటప్పుడు కాళేశ్వరం నుంచి అక్కడికి నీళ్లు ఇవ్వాల్సిన పనిలేదు. బీఆర్ఎస్ నేతలు మాత్రం దానికి కూడా లెక్కలోకి తీసుకువస్తుండటం గమనార్హం. మరోవైపు.. అక్కడ భూసేకరణ సైతం సమస్య వస్తుందని బీఆర్ఎస్ పదే పదే చెబుతున్నది. తుమ్మిడిహెట్టి వద్ద ఉన్న భూమి చాలా వరకు ప్రభుత్వ భూమే ఉన్నట్లు వెల్లడైంది. కేవలం 250 ఎకరాల ప్రైవేటు భూమి మాత్రమే సేకరణ చేస్తే ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు ఉండేవి. అంతేకాకుండా.. గ్రావిటీల వెడల్పు, లోతు పెంచడంతో పాటు ప్రాజెక్టును 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే నీరు అందేదని నిపుణుల అభిప్రాయం. 148 మీటర్ల ఎత్తునకు ఒప్పుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం 150 మీటర్ల ఎత్తులో నిర్మించుకునేందుకు కేంద్రం ఒప్పించేదన్న అభిప్రాయాన్ని వెల్లడించారు.
ప్రాణహితతో ఖర్చు, మెయింటెనెన్స్ తక్కువ
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తే కేవలం గ్రావిటీల ద్వారానే ఎల్లంపల్లి వరకు నీరు వచ్చి చేరుతుండేది. తక్కువ ఖర్చులో ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తయ్యేది. కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడు బ్యారేజీలు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నిర్మించడంతో ఖర్చు తడిసిమోపెడు అయింది. వాటి నుంచి ఏటా నీరు ఎత్తిపోయాలంటే కరెంటు బిల్లులు వేలాది కోట్లలో ఖర్చు చేయాల్సిందే. ఒక్క ఏడాది 3 బ్యారేజీల మోటార్లు నడిపించినందుకే రూ.7వేల కోట్ల వరకు కరెంటు బిల్లులు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. దాంతో అటు ప్రాజెక్టు నిర్మాణ వ్యయంతో పాటు లిఫ్టింగ్ నిర్వహణ భారం కూడా అదనంగా మారిపోయింది. మరోవైపు.. ఈ భారమంతా రైతులపై పడే ప్రమాదం ఏర్పడింది. ప్రాణహిత నిర్మాణంతో లిఫ్ట్‌లు లేకపోవడం వల్ల కరెంటు భారం కూడా ఉండేది కాదు.
రాజకీయ ప్రయోజనాల కోసమేనా..?
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.10 వేల కోట్ల వరకు ఖర్చుపెట్టి భూసేకరణతోపాటు ఇతర పనులను చేపట్టింది. 71 కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ తవ్వించింది. కానీ.. ఆ తరువాత రాష్ట్రం విడిపోవడం బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది. ప్రాణహితను ఎఫ్ఆర్ఎల్ 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే కిందకు నీళ్లు వస్తాయన్న సాకుతో ప్రాజెక్టును అక్కడి నుంచి మేడిగడ్డకు లొకేషన్ మార్చింది. దాంతో ప్రాజెక్టు వ్యయం కాస్త ఒక్కసారిగా పెరిగిపోయింది. రూ.40 వేల కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల నిర్మాణానికి రూపకల్పన చేస్తే.. కాళేశ్వరం వ్యయం మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికే రూ.98 వేల కోట్లకు పైగా చేరుకుంది. దానిని పూర్తి చేయాలంటే మరో లక్ష కోట్ల వరకు వ్యయం అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది. అంటే మొత్తంగా రూ.2 లక్షల కోట్లు కేవలం కాళేశ్వరం నిర్మాణానికి ఖర్చు చేసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అయితే.. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రాజెక్టు లొకేషన్ మార్చారన్న అపవాదు బీఆర్ఎస్ పట్ల వినిపిస్తున్నది. భారీ నిధులతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో భారీ స్థాయిలో అవినీతి జరిగిందన్న ఆరోపణలూ ఉన్నాయి. అందులో భాగంగానే తాజాగా ఏసీబీ దాడుల్లో పట్టుబడుతున్న నీటిపారుదల శాఖల అధికారుల ఆస్తులు చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. వీరి ఆస్తులను చూస్తున్న ప్రజలు.. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రజాప్రతినిధులు ఏ స్థాయిలో వెనుకేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






