రేవంత్ రెడ్డి చేతల్లో చూపించారు.. తమిళనాడు CM స్టాలిన్ ప్రశంసలు

by Gantepaka Srikanth |
రేవంత్ రెడ్డి చేతల్లో చూపించారు.. తమిళనాడు CM స్టాలిన్ ప్రశంసలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నియోజ‌క‌వర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై తెలంగాణ శాస‌న‌స‌భ‌లో ఒక ముఖ్యమైన మైలురాయిలా నిలిచిపోయే తీర్మానం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త‌న మాట‌ల‌ను చేత‌ల్లో నిరూపించార‌ని త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కొనియాడారు. జనాభా ప్రాతిపదికన పున‌ర్విభ‌జ‌న‌ను వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన తెలంగాణ శాస‌న‌స‌భ‌ గురువారం తీర్మానం చేసిన నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎక్స్​వేదిక‌గా స్పందించారు. న్యాయం, స‌మాన‌త్వం, స‌మాఖ్య స్ఫూర్తిని స‌మ‌ర్థిస్తూ స‌రైన రీతిలో పున‌ర్విభ‌జ‌న కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ శాస‌న‌స‌భ‌లో తీర్మానం చేశారని త‌మిళ‌నాడు సీఎం పేర్కొన్నారు.

చెన్నైలో ప్రతిపాదించిన అంశాలు హైద‌రాబాద్‌లో నెర‌వేరాయ‌ని, ఇది ఆరంభం మాత్రమేన‌ని.. హైద‌రాబాద్‌లో ఐక్యకార్యాచ‌ర‌ణ స‌మితి రెండో స‌మావేశం నేప‌థ్యంలో మ‌రిన్ని రాష్ట్రాలు అదే బాట‌లో న‌డుస్తాయ‌ని త‌మిళ‌నాడు సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. పున‌ర్విభ‌జ‌న విష‌యంలో తమిళనాడును అనుసరిస్తూ, ఈ చ‌ర్యను ప్రజాస్వామ్య సమతుల్యతను దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా ప్రతిఘటించే స‌మ‌ష్టిత‌త్వాన్ని బ‌లోపేతం చేస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. భారతదేశ భవిష్యత్తును అధర్మ మార్గాన ఒక ప్రాంతానికి అన్యాయం చేసే రీతిన రాసేందుకు ప్రయత్నించే ఎవ‌రినీ అనుమ‌తించ‌బోమ‌ని స్టాలిన్‌ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed