తిరిగి అధికారంలోకి వస్తాం: తలసాని

by Gantepaka Srikanth |

మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. ఇచ్చిన హామీల అమలును మరిచి ప్రజలను మోసం చేసిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరిగి అధికారంలోకి వస్తాం: తలసాని
X

దిశ, తెలంగాణ బ్యూరో: మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. ఇచ్చిన హామీల అమలును మరిచి ప్రజలను మోసం చేసిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో జీహెచ్ఎంసీ స్థాయి బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం ఎమ్మెల్యే తలసాని అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి గ్రామపంచాయతీ ఎన్నికలలో కేవలం 17 శాతం స్థానాలు కేటాయించి తీవ్ర మోసం చేసిందని అన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేసి 5 రూపాయలకు భోజనం అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ క్యాంటీన్లుగా పేరు మార్చిందని విమర్శించారు. తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి, పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న వారికి సముచిత గౌరవం కల్పిస్తామని ప్రకటించారు. అలాగే.. రాష్ట్ర సాధన ఉద్యమంలో చరిత్రలో నిలిచిపోయే గొప్ప రోజు నవంబర్ 29 అని అన్నారు.

ఈ నెల 29న తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌ను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తలసాని తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా దివస్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గ ఇన్‌చార్జీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు ఎర్రోళ్ళ శ్రీనివాస్, గజ్జెల నగేష్, కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.

Next Story