- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చి చూపించండి.. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హాట్ కామెంట్స్
హైదరాబాద్ మహానగరాన్ని ఇష్టమొచ్చినట్లు, టెక్నికల్ స్టడీ లేకుండా విభజిస్తున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మహానగరాన్ని ఇష్టమొచ్చినట్లు, టెక్నికల్ స్టడీ లేకుండా విభజిస్తున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, జంట నగరాలైన హైదరాబాద్-సికింద్రాబాద్‌ల చారిత్రక ఉనికిని నాశనం చేసేలా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. 24 నియోజకవర్గాలు ఉన్న మహానగరాన్ని విభజిస్తున్నప్పుడు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదని తలసాని అన్నారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా విభజన చేసినట్లుగా కనిపిస్తోందని, డివిజన్లను కూడా సరిగా నిర్ణయించలేదని విమర్శించారు. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం బీఆర్ఎస్ హయాంలో 150 డివిజన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
జంట నగరాల ఉనికిని లేకుండా చేసే ప్రయత్నం
సికింద్రాబాద్‌కు ఎంతో చరిత్ర, సంస్కృతి ఉన్నాయని పేర్కొన్న ఆయన, ఆ చరిత్రను చెరిపివేయాలనే ఉద్దేశంతోనే జంట నగరాల ఉనికిని లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని చెప్పారు. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సహా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని, మద్దతిచ్చే పార్టీలతో కలిసి నిరసనలు తెలుపుతామని ప్రకటించారు. అవసరమైతే చట్టపరంగా, న్యాయపరంగా కూడా పోరాడతామని స్పష్టం చేశారు.
ఇలాంటి సీఎం, స్పీకర్‌ను ఎన్నడూ చూడలేదు
అసెంబ్లీ వ్యవహారాల తీరుపై కూడా తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఎంతోమంది ముఖ్యమంత్రులను, స్పీకర్లను చూశాం. ఇలాంటి ముఖ్యమంత్రిని, స్పీకర్‌ను ఎన్నడూ చూడలేదు” అని అన్నారు. గంటన్నర పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతు పురాణం మాట్లాడినా స్పీకర్ అడ్డుచెప్పలేదని విమర్శించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రభుత్వానికి వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి మాటలకు చేతలకు పొంతన లేదని, అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెబుతూనే అభిప్రాయం చెప్పకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. “ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చి చూపించండి” అంటూ ముఖ్యమంత్రికి తలసాని సవాల్ విసిరారు. మహానగర విభజనపై కాంగ్రెస్ నాయకులకు కనీస అవగాహన లేదని, ప్రభుత్వం ప్రజలను నగరం మొత్తం తిరిగే పరిస్థితి తీసుకొస్తోందని విమర్శించారు.






