T-SAT : ఐటీ ఉద్యోగాల అభ్యర్థులకు టి-సాట్ గుడ్‌న్యూస్.. కోర్సులపై ప్రత్యేక శిక్షణ

by Ramesh N |
T-SAT : ఐటీ ఉద్యోగాల అభ్యర్థులకు టి-సాట్ గుడ్‌న్యూస్.. కోర్సులపై ప్రత్యేక శిక్షణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ నిరుద్యోగ యువతకు (IT jobs) ఐటీ ఉద్యోగాల సాధనపై (T-SAT) టి-సాట్ (తెలంగాణ స్కిల్ అకడమిక్ ట్రైనింగ్) నెట్వర్క్ స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయనుంది. తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఐటీ ఉద్యోగుల కోసం వీఎల్ఎస్ఐ అవేర్నెస్ ప్రోగ్రాం పేరిట ఐదు నెలల పాటు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలుంటాయని టీ-సాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీవీసీ, టీఏఎస్‌కే, ఏఎస్ఐపీ, టి-సాట్ సంయుక్తంగా డిజైన్ చేసిన కోర్సులను ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల ద్వార అందిస్తున్నామన్నారు. ఐటీ ఉద్యోగాల సాధనలో ప్రాధాన్యత కలిగిన సెమీ కండక్టర్ ఇండస్ట్రీ విభాగాలకు సంబంధించిన చిప్ డిజైనింగ్, ప్రొడక్షన్ కోర్సులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు సీఈవో వివరించారు.

ఇప్పటి వరకు విద్య, పోటీ పరీక్షలు, వృత్తి నైపుణ్యం తదితర ప్రధాన అంశాలపై అవగాహన కార్యక్రమాల ప్రసారాలు చేసిన టి-సాట్ ఐటీ ఉద్యోగాల కల్పనపైనా ప్రత్యేక ప్రసారాలు చేసేందుకు కార్యక్రమాలు రూపొందించామని తెలిపారు. ఐటీ ఉద్యోగాల్లో ప్రధాన భూమిక పోషించే చిప్ డిజైనింగ్, ప్రొడక్షన్ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు ప్రత్యేక అవగాహన కల్పించాలని ఈ ప్రత్యేక ప్రసారాలు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులతో పాటు పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులకూ ఈ ప్రసారాలు ఉపయోగపడతాయని తెలిపారు. వీఎస్ఎస్ఐపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నవంబర్ 30వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ ఐటీ కమ్యూనికేషన్ శాఖ డిప్యూటీ సెక్రటరీ భావేశ్ మిశ్రా ప్రారంభిస్తారని చెప్పారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ప్రతి శనివారం టి-సాట్ నిపుణ ఛానల్ లో మరుసటి రోజు ఆదివారం సాయంత్రం విద్యా ఛానల్ లో ఏడు నుంచి ఎనిమిది గంటలకు ప్రసారమౌతాయని, ఏప్రిల్ 26వ తేదీ వరకు ఐదు నెలల పాటు ప్రసారాలు ఉంటాయని సీఈవో యువతకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed