TG: అసలు విషయం గ్రహించిన ప్రజలు.. ‘జూబ్లీహిల్స్‌’తో మరోసారి నిరూపితం!

by Gantepaka Srikanth |

సమాజంలో ఎవరైనా చనిపోతే వారి పట్ల, ఆ కుటుంబం పట్ల సానుభూతి చూపిస్తాం.. అయ్యే పాపం అంటాం.. మరణించిన వారితో ఎన్ని విబేధాలు ఉన్నా.. చనిపోయిన తర్వాత మాత్రం వారిపై అభండాలు, విమర్శలు చేయకుండా వారి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తాం.

TG: అసలు విషయం గ్రహించిన ప్రజలు.. ‘జూబ్లీహిల్స్‌’తో మరోసారి నిరూపితం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమాజంలో ఎవరైనా చనిపోతే వారి పట్ల, ఆ కుటుంబం పట్ల సానుభూతి చూపిస్తాం.. అయ్యే పాపం అంటాం.. మరణించిన వారితో ఎన్ని విబేధాలు ఉన్నా.. చనిపోయిన తర్వాత మాత్రం వారిపై అభండాలు, విమర్శలు చేయకుండా వారి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తాం. అయితే తెలంగాణలో మాత్రం సిట్టింగ్​ఎమ్మెల్యేలు చనిపోయినా సానుభూతి పవనాలు మాత్రం రావడంలేదు. వారి ఫ్యామిలీ మెంబర్ల పట్ల సానుభూతి చూపడంలేదు. సానుభూతి చూపుతున్నా.. అది ఓటు వరకు రావడం లేదని స్పష్టం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 నుంచి ఇప్పటి వరకు ఐదుగురు సిట్టింగ్​ఎమ్మెల్యేలు చనిపోయారు. మెదక్​జిల్లా నారాయణ్​ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.కృష్టారెడ్డి, దుబ్బాక బీఆర్‌ఎస్​శాసనసభ్యుడు రామలింగారెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్​ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ శాసనసభ్యుడు నోముల నర్సింహ్మయ్య, హైదరాబాద్​జిల్లా కంటోన్మెంట్​ఎమ్మెల్యే లాస్య నందిత, జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్‌లు పదవీలో కొనసాగుతూ చనిపోయారు. అలాగే కంటోన్మెంట్​ఎమ్మెల్యేగా ఉండి సాయన్న చనిపోయారు.

అయితే అప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిలోపే సమయం ఉండటంతో ఈసీ ఉప ఎన్నిక నిర్వహించలేదు. ఆ తర్వాత జరిగిన జనరల్​ఎన్నికల్లో బీఆర్‌ఎస్​నుంచి ఆయన కూతురుకు అవకాశం కల్పించారు. ఆమె గెలిచిన కొద్దినెలల్లోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. కాగా, ఆమె సొదరి నివేదితకు బీఆర్‌ఎస్​అవకాశం కల్పించింది. అయితే ఆమెపై కాంగ్రెస్​అభ్యర్థి శ్రీగణేశ్​గెలుపొందారు. అలాగే నారాయణఖేడ్​సిట్టింగ్​ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి చనిపోయారు. ఆయన కుమారుడు పి.సంజీవరెడ్డి పోటీచేసి ఓటమిపాలు కాగా అధికార బీఆర్‌ఎస్​అభ్యర్థి భూపాల్​రెడ్డి విజయం సాధించారు. చివరికి 2023లో కిష్టారెడ్డి కొడుకు సాధారణ ఎన్నికల్లో గెలుపొందారు. మాజీ మంత్రి, పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణించడంతో భార్య సుచరిత రెడ్డికి కాంగ్రెస్​పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. ఆమెపై ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వర్​‌రావును బీఆర్‌ఎస్​బరిలో దింపగా గెలుపుపొందారు. రెండుచోట్ల కూడా చనిపోయిన వారి సానుభూతి పనిచేయలేదు.

అధికార పార్టీకే గెలుపు అవకాశాలు

ఆ తర్వాత నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​నుంచి బీఆర్‌ఎస్​పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించిన నోముల నర్సింహ్మయ్య మరణించారు. ఆయన స్థానంలో కుమారుడు భగత్‌కు టిక్కెట్టు ఇచ్చారు. అయితే కాంగ్రెస్​నుంచి జానారెడ్డి పోటీ చేయగా అక్కడ మాత్రం నర్సింహ్మయ్య కొడుకు గెలుపొందారు. సానుభూతితో పాటు అబివృద్ధి నినాదం పనిచేసిందని చెప్పవచ్చు. అక్కడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థే విజయం సాధించారు. ఉమ్మడి మెదక్​జిల్లాకు చెందిన దుబ్బాక బీఆర్‌ఎస్​ఎమ్మెల్యే ఎస్‌ రామలింగా‌రెడ్డి మృతితో ఆయన భార్య సుజాత పోటీ చేయడంతో ఇక్కడ అనుహ్యంగా బీజేపీ అభ్యర్థి రఘనందన్​రావు స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. సానుభూతి, అధికార పార్టీ రెండు పనిచేయలేదని ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమైంది.

తాజాగా జూబ్లీహిల్స్‌‌లో బీఆర్‌ఎస్​సిట్టింగ్​ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​మరణించారు. ఆయన భార్య సునీతకు టిక్కెట్టు ఇవ్వగా కాంగ్రెస్​పార్టీ నవీన్​యాదవ్‌ను బరిలో నిలిపింది. ఇక్కడ కూడా సానుభూతి పనిచేయలేదు. అధికార పార్టీ అభ్యర్థి నవీన్​యాదవ్​ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇదీలా ఉండగా ఇప్పటి వరకు ఆరు స్థానాల్లో సిట్టింగ్​ఎమ్మెల్యేలు చనిపోతే ఉప ఎన్నికల్లో వారి కుటుంబ సభ్యులకు టిక్కెట్టు ఇచ్చినా ఒక్క నాగార్జున‌సాగర్‌ మినహా ఎక్కడా ఫలితం సానుకూలంగా రాలేదు. దుబ్బాక‌లో తప్ప అన్నిచోట్ల అధికార పార్టీ అభ్యర్థే గెలుపొందారు. ఈ నేపథ్యంలో సానుభూతి కంటే అధికార పార్టీ పవర్, అధికార పార్టీ అయితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రజలు, ఓటర్లు గ్రహించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story