- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇజ్రాయిల్ క్రూరత్వానికి ఈ నెల 7న సంఫీుభావ ర్యాలీ
ఇజ్రాయిల్ క్రూరత్వానికి ఈ నెలతో రెండేళ్లు పూర్తి అవుతుందని వామపక్ష నేతలు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సిపిఎం రాష్ట్రకార్యాలయం ఎంబి భవన్‌లో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అధ్యక్షతన వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఇజ్రాయిల్ క్రూరత్వానికి ఈ నెలతో రెండేళ్లు పూర్తి అవుతుందని వామపక్ష నేతలు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సిపిఎం రాష్ట్రకార్యాలయం ఎంబి భవన్‌లో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అధ్యక్షతన వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడారు. ఇజ్రాయిల్ దాష్టీకాలను ఖండిస్తూ, పాలస్తీనాకు సంఫీుభావంగా ఈ నెల 7న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో వామపక్ష పార్టీలు, ప్రజాస్వామ్య లౌకిక రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్ధలు పెద్దఎత్తున పాల్గొనున్నట్లు తెలిపారు . ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి ఇచ్చేశారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ జాతి హత్యాకాండను కొనసాగి స్తుందని, ఎడతెరపి లేకుండా గాజా భూభాగం మీద బాంబుల వర్షం కురిపిస్తూనే ఉందని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యాహుల మధ్య జరిగిన చర్చలలో గాజా నుంచి పాలస్తీనియన్లను తరిమివేసి ఆ భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌కు బేషరతుగా అమెరికా అండదండలు అందిస్తూ సహకరిస్తుందని, గాజాలోకి మానవతా సాయం ప్రవేశించకుండా నిరోధిస్తూ ఆ ప్రాంత ప్రజానీకాన్ని ఆకలితో అలమటించేలా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలికి తాళలేక పిల్లలు, పెద్దలు మరణిస్తున్న వార్తలు ప్రపంచాన్ని కలిచి వేస్తున్నాయని తెలిపారు. గాజాలో క్షామ పరిస్థితులు నెలకొన్నాయని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. గాజాలో నెలకొన్న దుర్భర పరిస్థితులను, ఇజ్రాయిల్ దాష్టీకాలను గురించి వార్తలు అందిస్తున్న జర్నలిస్టులను సైతం పథకం ప్రకారం ఇజ్రాయిల్ సేనలు హతమారుస్తున్నాయి. ఆఖరుకి ఆసుపత్రులను కూడా బాంబు దాడులతో ధ్వంసం చేస్తున్నారు. గాజా భూభాగం శిధిలాల కుప్పలా మారింది. ఇజ్రాయిల్ పచ్చి క్రూర రాజ్యంలా వ్యవహరిస్తున్నదని ఈ దాడులు నిరూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ న్యాయసూత్రాలు, రాయబార ప్రమాణాలను ఇజ్రాయిల్ అతిక్రమిస్తుందని, ఇజ్రాయిల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వ వైఖరిని సమావేశం తీవ్రంగా ఖండించింది. పాలస్తీనాకు సంఫీుభావంగా చేస్తున్న కార్యక్రమంతో పాటు మన దేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లకు నిరసనగా చేపట్టాల్సిన కార్యక్రమంపై చర్చ జరిగింది. త్వరలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని నాయకులు ప్రకటించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర నాయకులు డిజి నరసింహరావు, సిపిఐ జాతీయ నాయకులు ఈటీ నర్సింహ, సిపిఐఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్రకార్యదర్శి పోటు రంగారావు, నాయకులు రమ, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర జెవి చలపతిరావు, ఎంసిపిఐ(యు) రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, ఆర్‌ఎస్‌పి రాష్ట్రకార్యదర్శి జానకి రాములు, ఎస్‌యుసిఐ(సి) రాష్ట్ర నాయకులు భరత్ పాల్గొన్నారు.






