జొన్న రైతన్నలకు తీపి కబురు: మంత్రి తుమ్మల కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందులతో మొక్కజొన్నతో పాటు జొన్న పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.

జొన్న రైతన్నలకు తీపి కబురు: మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందులతో మొక్కజొన్నతో పాటు జొన్న పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగిందన్నారు. మొక్కజొన్న, జొన్న పంటలను ధర మద్దతు పథకం పరిధిలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరిన ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా మొక్కజొన్న, జొన్న పంటలను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదని, అక్కడి రైతులు బహిరంగ మార్కెట్లో లభించిన ధరలకే తమ పంటను అమ్ముకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో మాత్రం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుకు వచ్చి పంటలను కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. యాసంగి సీజన్‌లో 278 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను సేకరించినట్లు వెల్లడించారు. మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతులకు నష్టం కలగకుండా కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గత ఖరీఫ్ సీజన్‌లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3.76 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి రూ.902.80 కోట్ల వ్యయం భరించినట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం రైతులు తమ జొన్న పంటను మార్కెట్లకు తీసుకురావడం ప్రారంభించిన కావడంతో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, మొక్కజొన్న తరహాలోనే జొన్న పంటను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల జొన్న రైతులకు గణనీయమైన ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. రబీ సీజన్‌లో రాష్ట్రంలో మొక్కజొన్న పంటను సుమారు 11.21 లక్షల ఎకరాలలో సాగు చేయగా, అనుకూల వాతావరణ పరిస్థితులతో ఎకరానికి సగటు 26.57 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు తెలిపారు. అలాగే జొన్న పంటను 3.68 లక్షల ఎకరాలలో సాగు చేయగా, ఎకరానికి సరాసరి క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఈ ఒక్క సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంటల కొనుగోళ్ల కోసం దాదాపు రూ.6వేల కోట్ల వరకు వ్యయం చేసినట్లు, ఈ చర్యలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయన్నారు. కేంద్రం నుండి సహకారం లేకపోయినా రైతులను కష్టాల్లో వదిలేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోళ్లు నిర్వహించడం జరుగుతోందన్నారు. రైతుల ఆదాయ భద్రతకు ఇది కీలకమైన అడుగుగా నిలుస్తుందని వెల్లడించారు.

Next Story