ములుగు జిల్లాకు తీపికబురు.. ‘నిర్భయ నిధి’ కింద రూ.10 కోట్లు మంజూరు

by Kema Shiva Kumar |

ములుగు జిల్లాకు నిర్భయ ఫండ్ కింద రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణా దేవి ప్రకటించారు.

ములుగు జిల్లాకు తీపికబురు.. ‘నిర్భయ నిధి’ కింద రూ.10 కోట్లు మంజూరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ములుగు జిల్లాకు నిర్భయ ఫండ్ కింద రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణా దేవి ప్రకటించారు. గురువారం ఢిల్లీలో మంత్రి సీతక్క ఆమెతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదల కోసం విజ్ఞప్తి చేశారు. మిషన్ వత్సల్య పథకం కింద 22వేల మంది అనాథ పిల్లల సంరక్షణ కోసం రూ.105 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పీవీటీజీ ప్రాంతాల్లో 216 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.5 కోట్లు, పోషణ అభియాన్ కింద పెండింగ్‌లో ఉన్న రూ.71 కోట్లతో పాటు అదనంగా రూ.17 కోట్లు మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తులపై స్పందించిన కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవి ములుగు జిల్లాకు నిర్భయ ఫండ్ కింద రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పెండింగ్ నిధులను త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇవ్వగా.. మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.

ములుగు జిల్లా పర్యాటక అభివృద్ధికి సహకరించండి

మంత్రి సీతక్క గురువారం ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. మేడారం మాస్టర్ ప్లాన్ పనుల కోసం రూ.25కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Next Story