అన్నదాతలకు తీపికబురు.. పంట నష్టంపై అధికారులకు తుమ్మల కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో యూరియా కొరతపై అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

అన్నదాతలకు తీపికబురు.. పంట నష్టంపై అధికారులకు తుమ్మల కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో యూరియా కొరతపై అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెల్లవారింది మొదలు వ్యవసాయ పనులకు వెళ్లాల్సిన రైతులు పీఏసీఎస్‌ల ఎదుట క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు యూరియా కొరతపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం విధితమే. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు యూరియాపై కీలక ప్రకటన చేశారు. సోమవారం రాత్రి ఒక్కరోజే రాష్ట్రానికి 9 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. అదేవిధంగా ఇవాళ మరో 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని స్పష్టం చేశారు. మొత్తంగా మరో వారం రోజుల్లో తెలంగాణకు కేంద్ర నుంచి 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కానుందని తెలిపారు. అయితే, రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక జోరు వర్షాలకు ఆయా జిల్లాల్లో పంట నష్టంపై మరో 5 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు.

Next Story