- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఇద్దరి ఎమ్మెల్సీ పదవులపై కొనసాగుతున్న సస్పెన్స్
కోదండరాం, అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవులపై సస్పెన్స్ కొనసాగుతున్నది. వీరిద్దరిని గవర్నర్ కోటాలో ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేయగా.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: కోదండరాం, అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవులపై సస్పెన్స్ కొనసాగుతున్నది. వీరిద్దరిని గవర్నర్ కోటాలో ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేయగా.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే దీనిపై స్పష్టత రానుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల కోసం కోదండరాం, అమెర్ అలీఖాన్ ల పేర్లను నామినేట్ చేసింది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో కోదండరాం, అమెర్ అలీ ఖాన్ ల ఎమ్మెల్సీ పదవులను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17 తర్వాత చేపడతామని వాయిదా వేసింది. అయితే సుప్రీం కోర్టు తుది తీర్పు రాకముందే రాష్ట్ర మంత్రివర్గం ఆగస్టు 30న సమావేశమై.. గవర్నర్ కోటాలో తిరిగి కోదండరాంను, అమెర్ అలీఖాన్ స్థానంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే వీరిద్దరు ఎమ్మెల్సీలు కావాలంటే సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు వచ్చే వరకు వేచి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది.
రెండు స్థానాలపై మొదటి నుంచి సస్పెన్స్
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటాలోని ఈ రెండు స్థానాలకు అప్పటి ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను సిఫారసు చేసింది. అప్పుడు గవర్నర్‌గా ఉన్న తమిళి సై ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కోదండరాం, అమెర్ అలీఖాన్ పేర్లను నామినేట్ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలు న్యాయస్థానాలను ఆశ్రయించగా.. సుప్రీం కోర్టు వీరి పదవులను రద్దు చేసింది. అనంతరం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరా ను మళ్లీ ఎమ్మెల్సీని చేస్తామని ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. చెప్పినట్టుగానే రాష్ట్ర మంత్రివర్గం రెండోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి కోదండరాంను సిఫారసు చేసింది.
ఇక అజారుద్దీన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్‌లో రాబోయే ఉప ఎన్నికల్లో మళ్లీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేశారు. దీంతో ప్రభుత్వం అజారుద్దీన్ ను అనూహ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పేరు ప్రకటించింది. దీంతో ఆయన ఉప ఎన్నిక రేసు నుంచి తప్పుకొని ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవిని చేపట్టేందుకు న్యాయస్థానం తీర్పు కోసం వేచి చూస్తున్నారు. అయితే సెప్టెంబర్ 17 తర్వాత తదుపరి విచారణ చేపడతామన్న సర్వోన్నత న్యాయస్థానం చెప్పడంతో ఈ కేసు విచారణ కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది. అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కేటాయింపు అంశానికి ఎప్పుడు ముగింపు వస్తుందో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.






