బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతోన్న సస్పెన్స్..! ‘లోకల్’ వార్‌పై పీఏసీలో వాడీవేడి చర్చ

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించే అంశంపై కొనసాగుతున్న అనిశ్చితి కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలోనూ బహిర్గతమైనట్లు తెలిసింది.

బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతోన్న సస్పెన్స్..! ‘లోకల్’ వార్‌పై పీఏసీలో వాడీవేడి చర్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించే అంశంపై కొనసాగుతున్న అనిశ్చితి కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలోనూ బహిర్గతమైనట్లు తెలిసింది. ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉండటం, ఇటు సెప్టెంబర్​30లోపు స్థానిక ఎన్నికల పూర్తిచేయడం వంటి కీలక అంశాలు అధికార పార్టీకి సవాల్ గా మారాయి. ఈ అంశంపై పీఏసీలోనూ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్టీపరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలా? లేక ప్రభుత్వ పరంగా జీవోల జారీ ద్వారా వెళ్లడమా? అనే విషయమై నేతలు తమ అభిప్రాయాలు చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీపరంగా రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్తే ఇటు రిజర్వేషన్లు ఇచ్చామన్న మైలేజ్​పార్టీకి వస్తుందన్న అభిప్రాయం ఓ నేత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే పార్టీ పరంగా ఇచ్చే అంశంపై కొందరు నేతలు అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ పరంగానే ఇస్తేనే రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరుతుందని, పార్టీపరంగా అయితే ప్రత్యర్థుల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రధానంగా బీసీవర్గాలకు చెందిన నేతలు తమ అభిప్రాయాలను వెల్లబుచ్చినట్లు సమాచారం. దీనితో ఈ అంశాన్ని తేల్చేందుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుందామని, న్యాయకోవిదుల సూచనలతో ముందుకెళ్తే భవిష్యత్​లో ఇబ్బందులు లేకుండా రిజర్వేషన్లు కల్పించే అంశం కొలిక్కి వస్తుందని దాదాపు నేతలంతా అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది.

29న ‘రిజర్వేషన్ల’పై క్లారిటీ

బీసీల రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణుల సలహాల కోసం ఓ కమిటీ వేయాలని వారు మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా పేరొందిన ప్రఖ్యాత న్యాయ నిపుణులతో చర్చించి నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో తెరపైకి సంప్రదింపుల కమిటీ వచ్చింది. అయితే 26న మంత్రుల కమిటీ నివేదిక రానుండటంతో 25న జరగాల్సిన కేబినెట్​మీటింగ్​ను ఈనెల 29వ తేదీకి మార్చాల్సి వచ్చిందని పార్టీవర్గాలు తెలిపాయి. 29న బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల నిర్వహణపై ఏర్పడిన ప్రతిష్టంభన దాదాపు తొలగిపోతుందని పార్టీవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

జూబ్లీహిల్స్‌పై నజర్

జూబ్లీహిల్స్​ఉపఎన్నికలను కాంగ్రెస్​పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దీనిపై ఇప్పటికే ముగ్గురు మంత్రుల నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తున్నది. పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి కార్యక్రమాలతో ముందుకెళ్తోంది. ఇటీవల కొన్ని వివాదాస్పద అంశాలు చోటుచేసుకోవడంతో జాగ్రత్తగా వ్యవహరించాలని నేతలకు సూచనలు వెళ్లాయి. గ్రేటర్ హైదరాబాద్​లో విజయం సాధిస్తే ఆ ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుందని, రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలపడుతుందని ముఖ్యనేత చెప్పినట్లు తెలిసింది. నియోజకవర్గంలో అనేక వర్గాల ప్రజలు ఉన్నందున మాట్లాడేటప్పుడు, కార్యక్రమాల నిర్వహణలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని నేతలకు సూచించినట్లు సమాచారం. సున్నితమైన అంశాల జోలికి వెళ్లకుండా ఎన్నికల్లో అప్పగించిన పనులు, పార్టీ కార్యక్రమాల కోసం పనిచేసుకుంటూ వెళ్లాలని, అభ్యర్థి ఎంపిక, షెడ్యూల్​ వచ్చిన తర్వాత ప్రచార కార్యక్రమాల నిర్వహణ పార్టీ అధినాయకత్వం చూసుకుంటుందని, మీకు అప్పగించిన పనులపై దృష్టి సారించాలని ఆదేశించనట్లు సమాచారం.

స్పీకర్ ​నోటీసులపై ఏం చేద్దాం?

పీఏసీ సమావేశానికి ముందు జూబ్లీహిల్స్​లోని సీఎం రేవంత్​రెడ్డి నివాసంలో టీపీసీసీ కోర్​కమిటీ భేటీ జరిగింది. ఈ కీలక సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్​నోటీసులపై కూడా చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు స్పీకర్​నోటీసులు ఇవ్వడంతో రానున్న రోజుల్లో మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇవ్వొచ్చని, దీనిపై ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై కూడా చర్చించినట్ల సమాచారం. ఎమ్మెల్యేలు అందరికీ నోటీసులు అందిన తర్వాత దీనిపై చర్చిస్తే బెటరన్న అభిప్రాయానికి నేతలు తెలిసింది.

Next Story