Gachibowli Lands: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్

by Prasad Jukanti |

కంచె గచ్చిబౌలి భూముల్లో తక్షణమే అన్ని పనులు ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Gachibowli Lands: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో : హెచ్‌సీయూ (HCU) సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల్లో (Kancha Gachibowli Lands) జరుగుతున్న అన్ని పనులను తక్షణమే ఆపేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. ఈ భూములపై ఇవాళ ఉదయం విచారణ జరిపిన కోర్టు మధ్యంతర నివేదిక ఇవ్వాలని హైకోర్టును ఆదేశిస్తూ మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 3:40కి మరోసారి విచారణ ప్రారంభించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం.. హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదికను పరిశీలించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా సీరియస్ విషయమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చిన సుప్రీం.. అక్కడ అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటని నిలదీసింది. అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈనెల 16న తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

హైకోర్టులో విచారణ ఏప్రిల్‌ 7కు వాయిదా..

మరోవైపు ఇదే విషయంలో దాఖలైన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై నిన్న విచారణ జరిపిన కోర్టు ఒక రోజు పనులు ఆపాలని ఆదేశించింది. ఇవాళ మరోసారి విచారణ చేపట్టగా ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు అడ్వొకేట్ జనరల్ కోర్టును గడువు కోరారు. ఏజీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని నిన్న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఏప్రిల్ 7వ తేదీ వరకు పొడిగించింది. అలాగే భూములను అమ్మకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలవ్వగా.. దీనిపై విచారించిన హైకోర్టు విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Next Story