Supreme Court: మాజీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్

by Prasad Jukanti |

పాలమూరు-రంగారెడ్డిపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు విముఖత చూపింది.

Supreme Court: మాజీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో (Palamuru-Ranga Reddy Lift Irrigation) అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో మేఘా కంపెనీ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిగింది. నాగం తరఫున సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో పెద్ద ఫ్రాడ్ జరిగిందని ప్రభుత్వ ఖజానాకు రూ.2,426 కోట్ల నష్టం జరిగిందని వాదించారు. ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం 65 శాతం పంపులు, మోటార్ల కోసం బీహెచ్ఈఎల్ కు చెల్లింపులు చేయాలి. 35 శాతం సివిల్ వర్క్స్ కు మేఘాకు చెల్లింపులు చేయాలి కానీ, అంతర్గత ఒప్పందం ప్రకారం బీహెచ్ఈఎల్ కు 65 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారని మెఘాకు 80 శాతం చెల్లింపులు జరిగాయని కోర్టులో వాదనలు వినిపించారు. 65:35 నుంచి 20:80 కు ఎలా మారింది? ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని వాదించారు.

ఇక మేఘా సంస్థ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ నాయ్యవాది ముకుల్ రోహిత్గీ.. తెలంగాణ హైకోర్టులో దీనికి సంబందించిన 5 పిటిషన్లు కొట్టివేశారని ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేదని స్పష్టం చేసిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సివిసి కూడా ఇందులో ఏమి లేదని తేల్చిందని ఎస్టిమేషన్ పెంచడాన్ని తప్పు పడుతున్నారని తెలిపారు. బీహెచ్ ఈ ఎల్ కూడా ఇందులో ఫిర్యాదు చేయలేదని ఏదో ఒక డాక్యుమెంట్ తెచ్చి కేసులు వేస్తున్నారన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ విషయంలో సీబీఐ విచారణకు (CBI investigation) విముఖత వ్యక్తం చేస్తూ పిటిషన్ ను కొట్టివేసింది.

Next Story