ఆ 600 ఎకరాలు అటవీ భూమే.. దశాబ్దాల వివాదానికి తెరదించిన సుప్రీంకోర్టు

by Naga Rani Yarlagadda |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం కాల్వలనాగరంలోని 600 ఎకరాల వివాదాస్పద భూములపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది.

ఆ 600 ఎకరాలు అటవీ భూమే.. దశాబ్దాల వివాదానికి తెరదించిన సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం కాల్వలనాగరంలోని 600 ఎకరాల వివాదాస్పద భూములపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ఈ న్యాయ పోరాటానికి స్వస్తి పలుకుతూ.. ఆ భూమి రక్షిత అటవీ ప్రాంతమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

రెవెన్యూ రికార్డులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. "రెవెన్యూ రికార్డులు కేవలం పన్నుల వసూలు కోసం మాత్రమే ఉపయోగపడతాయి. అంతేకానీ, అవి సదరు భూములపై యాజమాన్య హక్కులను కల్పించవు" అని కోర్టు స్పష్టం చేసింది. గతంలో ఇదే అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది.

నిజాం నాటి నోటిఫికేషన్ యథాతథం

1950లో నిజాం ప్రభుత్వం జారీ చేసిన ఫారెస్ట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ అప్పీలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఆ భూమి తమదేనని నిరూపించుకోవడానికి అప్పీలుదారులు ఎలాంటి ఒరిజినల్ పత్రాలను సమర్పించలేదని ధర్మాసనం గుర్తించింది. దీంతో 1950 నాటి నోటిఫికేషన్ ప్రకారం ఆ 600 ఎకరాలు అటవీ భూమిగానే కొనసాగుతాయని కోర్టు తేల్చి చెప్పింది. అప్పీలుదారులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, అటవీ భూముల పరిరక్షణ విషయంలో రాజీ పడలేమని పరోక్షంగా సంకేతాలిచ్చింది. ఈ తీర్పుతో గత కొన్ని ఏళ్లుగా కాల్వలనాగరం భూములపై నెలకొన్న ఉత్కంఠకు ముగింపు పడింది. అటవీ శాఖకు ఈ తీర్పు పెద్ద ఊరటనిచ్చింది.

Next Story