- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: పునరుద్ధరించకపోతే జైలుకే.. కంచగచ్చిబౌలి భూములపై మరోసారి సుప్రీం హెచ్చరిక
కంచగచ్చిబౌలి భూములపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోని కంచగచ్చిబౌలి భూముల్లో (Kanchagachibowli Lands) పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే అధికారులకు జైలు తప్పదని సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి హెచ్చరించింది. సంచలనం సృష్టించిన హెచ్ సీయూ సమీపంలోని కంచగచ్చిబౌలి భూములపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే కంచగచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం నిన్న అఫిడవిట్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలతో చర్యలు తీసుకున్నామని ఈ భూముల్లో పనులు చేపట్టడం లేదని అఫిడవిట్ లో పేర్కొంది. పర్యావరణాన్ని పునరుద్ధరిస్తున్నామని తెలిపింది. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిశీలించేందుకు అమికస్ క్యూరీ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను సీజేఐ ధర్మాసనం ఆగస్టు 13కు వాయిదా వేసింది.
కాగా, కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల్లో టీజీఐఐసీ ఆధ్వర్యంలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సుమోటో కేసు నమోదు చేసింది. ఈ అంశంపై గత మే లో విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. పర్యావరణానికి జరిగే నష్టాన్ని పూడ్చే చర్యలు చేపట్టకపోతే సీఎస్ సహా కార్యదర్శులు జైలుకు పోవాల్సి ఉంటుందని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. నష్టాన్ని పూడ్చేందుకు తీసుకున్న చర్యలు ఏమిటో స్పష్టంగా చెప్పాలని ఆదేశిస్తూ కేసు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ మేరకు ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం ఇరువైపుల వాదనలు విని తదుపరి విచారణ ఆగస్టు 13కు వాయిదా వేసింది.






