Supreme Court : తెలంగాణ సర్కార్ కు సుప్రీం షాక్

by Muthe.Rajitha |   (  Updated:2025-03-04 11:18:33  IST  )

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు(MLAs Party Defection Case) నేడు సుప్రీం కోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది.

Supreme Court : తెలంగాణ సర్కార్ కు సుప్రీం షాక్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు(MLAs Party Defection Case) నేడు సుప్రీం కోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది. బీఆర్ఎస్ బీ ఫారం మీద గెలిచి, అధికార పార్టీలోకి మారిన 10 ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్(Assembly Speaker) ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Koushik Reddy) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం.. స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధుల పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తే ఇంక విలువలు ఏముంటాయని స్పీకర్ ను ప్రశ్నించింది. అయితే దీనిపై స్పందించిన స్పీకర్ తరపున న్యాయవాది.. ఇప్పటి వరకు తమకు నోటీసులు అందలేదని కోర్టుకు తెలిపారు. వీరి వాదన పరిగణలోకి తీసుకొని ఈ కేసులో ప్రతివాదులైన అసెంబ్లీ సెక్రెటరీ(Assembly Secretary), స్పీకర్(Speaker), రాష్ట్రప్రభుత్వం(Telangana Govt), రాష్ట్ర ఎన్నికల కమిషన్(Election Commission), హైకోర్ట్ రిజిస్ట్రార్ కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులకు మార్చ్ 22 లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం మార్చ్ 25కు వాయిదా వేసింది. అయితే తమ పార్టీ బీ ఫారం మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్ట్ సింగిల్ బెంచ్.. ఆ 10 మంది ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్ట్ సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ.. అసెంబ్లీ సెక్రెటరీ ప్రత్యేక బెంచ్ కు అప్పీల్ చేసుకోగా.. అనర్హులుగా ప్రకటించేందుకు ఎంత సమయం తీసుకోవాలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. కాగా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం.

Next Story