Supreme Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-03 07:12:05  IST  )

ఏడుగురు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీం కోర్టు పిటిషన్ దాఖలు చేశారు.

Supreme Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏడుగురు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీం కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు‌ అనర్హత పిటిషన్లతో పాటు కలిపి విచారిస్తామని కోర్టు వెల్లడించింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి‌కి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.

కాగా, ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌ పార్టీ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (SLP) వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్‌ గవాయ్‌, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలంటూ తెలంగాణ (Telangana) అసెంబ్లీ సెక్రటరీ (Assembly Secretary)పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు ప్రభుత్వం తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi) తగిన సమయం ఇవ్వాలంటూ కోర్టు అభ్యర్థించారు. అందుకు ధర్మాసనం మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? అంటూ ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ (Reasonable Time) అంటే మహారాష్ట్ర (Maharashtra) తరహాలో శాసనసభ గడువు ముగిసే దాకా.. అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు ప్రభుత్వం తరఫు లాయర్ ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi) స్పందిస్తూ.. శాసనసభ స్పీకర్‌ (Legislative Assembly Speaker)ను అడిగి నిర్ణయాన్ని కోర్టుకు విన్నవిస్తామని బదులిచ్చారు. దీంతో తదుపరి విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

Next Story