- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్రజోన్నలకు మద్దతు ధర కల్పించాలి: జీరో అవర్‌లో సభ్యుల విన్నపాలు
తెలంగాణ అసెంబ్లీలో పలు ప్రజా సమస్యలపై సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎర్రజోన్నలకు మద్దతు కల్పించడంతో రూ.500 బోనస్ చెల్లించాలని సభ్యులు ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గతేడాది క్వింటాల్‌కు రూ.3,800 పలికితే ఈసారి వ్యాపారులంతా సిండికేట్‌గా మారి రూ.3,300లకే కొనుగోలు చేస్తున్నారని, దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పీఏసీఎస్‌లలో యూరియాను అందుబాటులో ఉంచాలని కోరారు. మొక్కజోన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సభ్యులు కడియం శ్రీహరి కోరారు. బడంగ్ పేట్ హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ నిబంధనలను మార్చాలని సభ్యులు సబితాఇంద్రారెడ్డి కోరారు. హెచ్ఎండీఏ అధికారులు రూపొందించిన డ్రాఫ్ట్ ప్లాన్ రెడీగా ఉందని, ప్రభుత్వం ఆమోదిస్తే 2వేల కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్నారు.
ఇక ఆర్మూర్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలకు సంబంధించిన భవనాల నిర్మాణ పనులు చేపట్టాలని రాకేష్ రెడ్డి కోరారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను కంట్రోల్ చేయాల్సిన పోలీసులు ఛలాన్ల కోసం ఫొటోలు మాత్రమే తీస్తున్నారని జాఫర్ హుస్సేన్ కోరారు. కొత్తగూడెం ప్రాంతంలోని బెటాలియన్ పోలీసులకు 42 టీఏ, సరెండర్ లీవ్స్‌కు సంబంధించిన బిల్స్ చెల్లించాలని కూనంనేని సాంబశివరావు కోరారు. బీసీలకు బడ్జెట్ లో రూ.20వేల కోట్లు కేటాయించాలని, మేనిఫెస్టోలో చెప్పినట్టు ఐదేండ్లలో బీసీలకు లక్షకోట్ల బడ్జెట్ ఏమైందని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. అప్పా జంక్షన్ నుంచి చెవేళ్ల రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కాలే యాదయ్య తెలిపారు. అయితే మరో మూడు అండర్ పాస్ లను కూడా నిర్మించాని కోరారు. బుడగ జంగాల పిల్లల కోసం ప్రత్యేకంగా హస్టల్ వసతి కల్పించాలని యశస్విని రెడ్డి కోరారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని జీఓ నెం.118అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుధీర్ రెడ్డి కోరారు. దీనిపై మంత్రి పొంగులేని శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ జీవో నెం.118ని ప్రభుత్వం ఆపేసిన మాట వాస్తమేనని తెలిపారు. ప్రభుత్వం పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కల్వల ప్రాజెక్టుకు రూ.70కోట్లు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి కోరారు. కరీంనగర్ సీపీ గౌస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్ సాక్షిగా జాతీయ గీతానికి అవమానం జరిగిందని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కె.వెంకటరమణరెడ్డి కోరారు. నగరంలో గంజాయి దందా పెరిగిందని, నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని మాజీద్ హుస్సేన్ అన్నారు. జాతీయ రహదారిపై వాహనాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికి అనుసంధానంగా సబ్ వే, సర్వీస్ రోడ్డును నిర్మించాలని భూపతిరెడ్డి కోరారు. తమ నియోజకవర్గ పరిధిలోని అన్ని డిపార్ట్ మెంట్లలో ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని సంజీవరెడ్డి కోరారు. సభ్యులు లేవనెత్తిన అంశాలకు మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి సమాధానాలు చెప్పారు.






