మావోయిస్టులకు ఆ రెండు పార్టీల అండ.. పరేడ్ గ్రౌండ్స్ సభలో ప్రధాని మోడీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-10 14:20:17  IST  )

ఒకప్పుడు దక్షిణాదిలో, ఈశాన్యంలో బీజేపీని అంటరాని పార్టీగా చూశారని.. ఇప్పుడు వాళ్లే కన్నతల్లిగా కాపాడుకుంటున్నారని ప్రధాని మోడీ అన్నారు.

మావోయిస్టులకు ఆ రెండు పార్టీల అండ.. పరేడ్ గ్రౌండ్స్   సభలో ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు రెండూ కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీలేనని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) విమర్శించారు. ఇవాళ సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఇవాళ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కేంద్రం నిర్మిస్తున్న 14 పారిశ్రామిక కారిడార్లలో ఒక దానిని జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడిస్తూ కాంగ్రెస్ (Congress) పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకే రకమైన మోడల్ నడుస్తోందని.. ఎన్నికల ముందు అమలు చేయలేని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని తప్పించుకోవడానికి సాకులు వెతకడం ఆ పార్టీకి అలవాటని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ధోరణిని అవలంబిస్తోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.

దేశం మొత్తం మార్పు కోరుకుంటుంది..

ఒకప్పుడు దక్షిణాదిలో, ఈశాన్యంలో బీజేపీ (BJP)ని అంటరాని పార్టీగా చూశారని.. ఇప్పుడు వాళ్లే కన్నతల్లిగా కాపాడుకుంటున్నారని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణ యువత ప్రేమ తన కళ్లతో స్వయంగా చూస్తున్నానని పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు. పశ్చిమ బెంగాల్ ఫలితంపై ప్రపంచమంతా చర్చ జరిగిందని తెలిపారు. అక్కడ ఓడింది రాజకీయ పార్టీ కాదని, రాజ్యాగ వ్యతిరేక శక్తులని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం మార్పు కోరకుంటుందని, ఏ రాష్ట్రంలోనూ కుటుంబ పాలనను ప్రజలకు కోరుకోవడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని అన్నారు. బీజేపీ దృష్టి ఎప్పుడూ అభివృద్ధి, ఉపాధి మీదే ఉంటుందన్నారు.

తెలంగాణ పోలీసులకు ఆనాడే ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉంటే..

కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మావోయిస్టుల (Maoist)కు అండగా నిలుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేసిందని, అప్పట్లోనే తెలంగాణ పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే వారిని ఎప్పుడో అణిచివేసేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం మావోయిస్టులు తమ అంతిమ శ్వాసను లెక్కిస్తున్నారని, తెలంగాణ క్రమంగా మావోయిస్టు రహితంగా మారుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇక అంతర్జాతీయ యుద్ధాల కారణంగా ఇంధన సంక్షోభం తలెత్తినప్పటికీ దేశంలో ధరలు పెరగకుండా నియంత్రిస్తున్నామని వెల్లడించిన ఆయన, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజలు మెట్రో సేవలను, ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వినియోగించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలి..

దేశ ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసే దిశగా విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలని, ఇందుకోసం కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు, బంగారం కొనుగోళ్లు, వంట నూనెలు, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్న రసాయన ఎరువుల వల్ల భూమికి నష్టం వాటిల్లుతోందని, వాటి వాడకాన్ని తగ్గించడం ద్వారా విదేశీ ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని సూచించారు. వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగానికి బదులుగా సోలార్ పంప్‌సెట్లను ప్రోత్సహిస్తున్నామని, రైతులు స్వదేశీ పరికరాలను ఎక్కువగా వాడాలని కోరారు. కేవలం దీపావళి దీపాలు కొనడం మాత్రమే 'స్వదేశీ'ని ప్రోత్సహించడం కాదని, రోజువారీ జీవితంలో విదేశీ వస్తువులపై ఆధారపడటం తగ్గించుకోవడమే అసలైన స్వదేశీ మంత్రమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Next Story