- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYDRA : సున్నం చెరువు సరిహద్దుల్లో లే ఔట్ కలకలం
శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి మండలాల సరిహద్దులో గుట్టల బేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య విస్తరించిన సున్నం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) పరిధిలోనే సియెట్ (SIET) లే ఔట్ ఉన్నదని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి మండలాల సరిహద్దులో గుట్టల బేగంపేట, అల్లాపూర్ గ్రామాల మధ్య విస్తరించిన సున్నం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) పరిధిలోనే సియెట్ (SIET) లే ఔట్ ఉన్నదని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. చెరువు పరిరక్షణలో భాగంగా గతంలో హెచ్‌ఎండీఏ మంజూరు చేసిన డ్రాఫ్ట్ లేఔట్‌ను కూడా ఇదే కారణంగా రద్దు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అలాగే, అదే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జీహెచ్ఎంసీ అనంతరం ఆ అనుమతులను రద్దు చేసుకున్నదని తెలిపారు.
ఈ నేపథ్యంలో “న్యాయం చేయాలి” అంటూ లేఔట్ ప్లాట్ల యజమానులు చేస్తున్న ఆందోళనకు ప్రామాణికత లేదని హైడ్రా అభిప్రాయపడింది. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 32.60 ఎకరాలుగా ఉండగా, 1975లో సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన మ్యాపుల్లో కూడా ఇదే స్పష్టమైందని హైడ్రా పేర్కొంది. అంతేకాక, గ్రామ రికార్డుల్లోనూ ఇదే సమాచారం ఉందని, హైకోర్టు ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా ప్రత్యేక సర్వే నిర్వహించినట్లు తెలిపింది. అన్ని పక్షాల పరిశీలన అనంతరం చెరువు ఎఫ్‌టీఎల్‌లోనే లే ఔట్ ఉన్నట్టు తేలినదని వివరించింది.
చెరువు పరిధిలో ఆక్రమించిన నాలాలపై నిర్మాణాలు సహించరాదని, వాటిని తక్షణమే తొలగించాలన్న కోర్టు ఆదేశాలను మరోసారి గుర్తు చేసింది. ప్రస్తుతం లే ఔట్ పరిధిలో నిర్మాణాలు ప్రారంభం కాలేదని, ఖాళీగా ఉన్న ప్లాట్ల యజమానులు అర్హత ఉన్నట్లైతే నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. చివరగా, సున్నం చెరువు పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగించవద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది.






