Sunday Special మాంసం ప్రియులకు పండుగే : తెలుగు రాష్ట్రాల్లో భారీగా దిగివచ్చిన చికెన్ ధరలు

by Ramesh Naini |

గత కొంతకాలంగా మండిపోతున్న చికెన్ ధరలతో బెంబేలెత్తిన సామాన్యులకు ఇది నిజంగా శుభవార్తే. తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) చికెన్ ధరలు భారీగా పతనమయ్యాయి.

Sunday Special మాంసం ప్రియులకు పండుగే : తెలుగు రాష్ట్రాల్లో భారీగా దిగివచ్చిన చికెన్ ధరలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదివారం వచ్చిందంటే చాలు మాంసం ప్రియుల ఇంట్లో సందడి మామూలుగా ఉండదు. బిర్యానీ, ఫ్రై, కర్రీ.. ఇలా రకరకాల వంటకాలతో ఘుమఘుమలాడాల్సిందే. అయితే, గత కొంతకాలంగా మండిపోతున్న చికెన్ ధరలతో బెంబేలెత్తిన సామాన్యులకు ఇది నిజంగా శుభవార్తే. తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) చికెన్ ధరలు భారీగా పతనమయ్యాయి. మార్చి నెలలో కిలో ఏకంగా రూ.400 వరకు చేరి రికార్డు సృష్టించిన ధరలు, ప్రస్తుతం అమాంతం దిగిరావడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

రూ.40 వరకు తగ్గిన ధరలు..

సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే మాంసాహారం చికెన్. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం చికెన్ ధర కిలోకు ఏకంగా రూ.40 వరకు తగ్గింది. ఏప్రిల్ 26 (ఆదివారం) నాటి తాజా మార్కెట్ వివరాల ప్రకారం ఫామ్ రేట్, రిటైల్ ధరల్లో స్పష్టమైన తగ్గుదల కనిపించింది.

తెలుగు రాష్ట్రాల్లో తాజా చికెన్ ధరల వివరాలు (కిలోకు):

లైవ్ బర్డ్ (ఫామ్ రేట్): రూ. 105

లైవ్ బర్డ్ (రిటైల్ రేట్): రూ. 132

డ్రెస్సెడ్ చికెన్: రూ. 191 నుంచి రూ. 220

స్కిన్‌లెస్ చికెన్: రూ. 218 నుంచి రూ. 230

(గమనిక: ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కిలో చికెన్ ధర రూ. 260 నుంచి రూ. 280 వరకు పలుకుతోంది.)

మటన్, గుడ్ల ధరల పరిస్థితి..

చికెన్ ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చినప్పటికీ, మటన్ ధరలు మాత్రం ఇంకా గగనంలోనే ఉన్నాయి. మార్కెట్‌లో ప్రాంతాన్ని బట్టి కిలో మటన్ ధర రూ. 900 నుంచి రూ. 1000 వరకు పలుకుతోంది. ఇకపోతే రిటైల్ మార్కెట్‌లో డజను (12) గుడ్ల ధర రూ. 72 గా నమోదైంది.

ఎండల ప్రభావం..

రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కోళ్ల పెంపకం, వినియోగంపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రాబోయే రోజుల్లోనూ చికెన్ ధరలు మున్ముందు కూడా తక్కువగానే, ఇదే తరహాలో కొనసాగే అవకాశం ఉందని కోళ్ల ఫామ్ వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ధరలు దిగిరావడం మాంసం ప్రియులకు పండుగ లాంటి వార్తే.

Next Story