ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా సుదర్శన్ రెడ్డి? కేబినెట్ హోదా ఇవ్వాలనే ఆలోచనలో సీఎం

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-18 01:46:25  IST  )

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి (బోధన్)కి ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి (కేబినెట్ హోదా) ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా సుదర్శన్ రెడ్డి? కేబినెట్ హోదా ఇవ్వాలనే ఆలోచనలో సీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి (బోధన్)కి ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి (కేబినెట్ హోదా) ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ స్వయంగా సుదర్శన్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా అందుకు ఆయన అంగీకరించలేదని తెలిసింది. దీంతో ఆయన్ను ఒప్పించేందుకు సీఎం సన్నిహితులు రంగంలోకి దిగినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అంతా అనుకున్నట్టు జరిగితే స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు నియామకానికి సంబంధించిన జీవో జారీ అవుతుందని ప్రభుత్వ వర్గాల టాక్.

తొలి చీఫ్ అడ్వయిజర్ పోస్టు

ప్రభుత్వంలో ఇప్పటివరకు 6 మంది అడ్వయిజర్లు మాత్రమే ఉన్నారు. ఎవరికీ కేబినెట్ హోదా లేదు. కానీ తొలిసారిగా సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదాతో ప్రధాన సలహాదారు పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ప్రతి కేబినెట్ సమావేశంలో ప్రాతినిధ్యం ఉండే విధంగా జీవో ఇవ్వాలని, దీంతో ప్రభుత్వ విధానాల్లో ఆయన సలహాలు, సూచనలు తీసుకునే వెసులుబాటు ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కేబినెట్‌లో ఎవరికి ప్రాతినిధ్యం లేదు. దీంతో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా బాధ్యతలు చూసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఎలక్షన్ షెడ్యూలు వచ్చేలోపు సుదర్శన్ రెడ్డికి ప్రధాన సలహాదారు పదవి ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది.

మంత్రి పదవి కష్టమే?

కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడంలో సుదర్శన్‌రెడ్డి పాత్ర కీలకమైందనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే ఆయనను కేబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నించారు. కానీ సామాజిక సమీకరణాలు కుదరకపోవడంతో సాధ్యం కాలేదు. అధిష్టానం వద్ద కేబినెట్ విస్తరణ అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ సీఎం రేవంత్... సుదర్శన్ రెడ్డి పేరును లిస్టులో మొదటగా పెట్టేవారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మందికి పదవులు దక్కాయి. అందుకే ఈ మధ్య జరిగిన కేబినెట్ విస్తరణలో ఒక బీసీ, ఇద్దరు ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మినిస్టర్ పదవులు ఇచ్చారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మరో మూడు మంత్రి పదవుల్లో సైతం ఓసీ వర్గాలకు చెందిన వారికి అవకాశం ఉండదని ప్రచారం జరుగుతున్నది.

Next Story