High Court: చారిత్రక కట్టడాల వద్ద మెట్రో మ్యాప్ సమర్పించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

by Prasad Jukanti |

పాతబస్తీ మెట్రో నిర్మాణంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది.

High Court: చారిత్రక కట్టడాల వద్ద మెట్రో మ్యాప్ సమర్పించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిర్దేశించిన చారిత్రక కట్టడాల వద్ద మెట్రో నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది. పాత బస్తీలో మెట్రో నిర్మాణంపై ఏపీడబ్ల్యూఎఫ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. మెట్రో నిర్మాణాల వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని, పురావస్తు శాఖ అనుమతి లేకుండా మెట్రో నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. చారిత్రక కట్టడాల సమీపంలో ఎలాంటి పనులు చేపట్టొద్దన్న నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదని కోర్టుకు తెలిపారు. దీంతో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‍ఖాన్ వాదనలు వినిపిస్తూ చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం లేకుండా మెట్రో నిర్మాణం కొనసాగుతోందని, పాతబస్తీ అభివృద్ధికి మెట్రో (Old City Metro) ఎంతో కీలకమని వాదన వినిపించారు. ఈ సందర్భంగా మెట్రో రెండో దశ డిజైన్, నిర్మాణ పనుల గురించి సీజే ఏఏజీని ప్రశ్నించారు. దీంతో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు రెండో దశ మెట్రో చేపట్టిందని, అభివృద్ధి పనులను అడ్డుకోవడానికే పిటిషన్ దాఖలు చేశారని ఏఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. నిర్మాణ పనులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని, నిర్దేశించిన చారిత్రక కట్టడాల వద్ద మెట్రో నిర్మాణానికి సంబంధించి మ్యాప్ సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచాణ ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.

Next Story