బీసీ రిజర్వేషన్లలో సబ్ కేటగరైజేషన్ చేయాలి.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యేంత వరకు తెలంగాణ జాగృతి పోరాటం ఆగదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

బీసీ రిజర్వేషన్లలో సబ్ కేటగరైజేషన్ చేయాలి.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యేంత వరకు తెలంగాణ జాగృతి పోరాటం ఆగదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు, 72 కులాల ప్రతినిధులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆ 25 వేల పదవుల్లో సగం మన ఆడబిడ్డలకే అవకాశం దక్కుతుందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్ కోటా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్పంచ్‌లు, ఎంపీపీలుగా ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని ఎన్నో కులాలు బీసీలలో ఉన్నాయని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం ఎంత ముఖ్యమో రాజకీయ అవకాశాలు దక్కని వారికి పదవులు దక్కేలా సబ్ కోటా ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని.. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని కవిత ఆరోపించారు.

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ కేబినెట్ చేసిన సవరణ తీర్మానం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వెంటనే కేబినెట్ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసి బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్‌పై గెజిట్ విడుదల చేయాలని గవర్నర్‌ జిష్ణదేవ్ వర్మకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఆర్డినెన్స్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ వేయకుంటే ఎవరైనా కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లకు అడ్డుతగిలే ప్రమాదం ఉందన్నారు. ఆ అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రిజర్వేషన్లను పెంచుతూ చట్ట సవరణ చేసే అధికారం కేంద్రం పరిధిలో ఉంటే ఉన్న రిజర్వేషన్లలో సబ్ కేటగరైజేషన్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. రాజకీయ అవకాశాలు దక్కని కులాల నుంచి సర్పంచ్‌లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు కావాలంటే సబ్ కేటగరైజేషన్ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవియెట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇస్తే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేశారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడివంచారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వేధిస్తోందని.. వెంటనే రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

Next Story