- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులు సరే.. ఉపాధ్యాయులేరి? భూపాలపల్లి జిల్లాలో బోధనకు టీచర్లు కరువు!
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ఉపాధ్యాయులను నియమించడంలో నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ ఉన్నట్లుగా ఉంది ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ప్రతియేటా బడిబాట కార్యక్రమాలు చేపడుతోంది. ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ, అందుకనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫాం అందజేస్తూ మౌలిక వసతులు అన్ని కల్పిస్తున్నా సరిపడా ఉపాధ్యాయులను నియమించడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దిశ భూపాలపల్లి ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ఉపాధ్యాయులను నియమించడంలో నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించకపోవడం కొన్ని పాఠశాలలో పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు లేకపోవడం ప్రభుత్వ విద్య పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలో 70 ఉన్నత పాఠశాలలు, 43 ప్రాథమికోన్నత పాఠశాలలు, 81 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. గత నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఇంటింటా తిరిగి ఇప్పటివరకు భూపాలపల్లి జిల్లాలో 1331 విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఇందులో చాలా మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్లిన వారు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తారని ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పడంతో చాలామంది విద్యార్థులు పాఠశాలలో ప్రవేశం పొందారు. భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 18 వేలకు పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ వారి సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం విద్యార్థుల పట్ల శాపంగా మారింది.
ఉత్తీర్ణత బాగానే సాధించినప్పటికీ..
గేతేడాది 10వ తరగతి పరీక్షల్లో భూపాలపల్లి జిల్లాలో ఉత్తీర్ణత బాగానే సాధించినప్పటికీ ర్యాంకులు సాధించలేకపోయారనే అపవాదు ఉంది. జిల్లాలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయుల పోస్టులు 6, స్కూల్ అసిస్టెంట్లు 75, ఎల్ ఎఫ్ ఎం హెచ్ ఎం లు 10, భాష పండితులు మూడు, ఎస్జీటీ 171, పీఈటీ ఒక పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 286 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా వాటి భర్తీ చేసే ప్రక్రియ మాత్రం ప్రభుత్వం చేపట్టడం లేదు. జిల్లాలో 39 మూసివేసిన పాఠశాల ఉండగా అందులో రెండు పాఠశాలను ఇటీవల ప్రారంభించారు. ఇంకా 37 పాఠశాలలు మూసివేసి ఉన్నాయి. ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడం విద్యార్థులు ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపడంతో పాఠశాలలు మూతపడి ఉన్నాయి. విద్యార్థులకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను నియమిస్తే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం
ప్రభుత్వం బడిబాట కార్యక్రమం ఉపాధ్యాయుల కృషి మేరకు కొన్ని పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారంతో ప్రారంభించడం, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాల, యూనిఫామ్ ఇవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజా ప్రతినిధులు, స్థానిక రాజకీయ నాయకులు సైతం ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు వెళ్లాలని ప్రకటనలు ఇవ్వడం విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఒక కారణం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల నియామకం చేపడితే ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.






