వర్సిటీల్లో మళ్లీ విద్యార్థి సంఘం ఎన్నికలు..?

by Kema Shiva Kumar |

యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

వర్సిటీల్లో మళ్లీ విద్యార్థి సంఘం ఎన్నికలు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. వివిధ పార్టీల నాయకులు కూడా గతంలో లాగా విద్యార్థి ఎన్నికలు ఉండాలని బహిరంగ వేదికల్లో పలుమార్లు చెబుతూ వస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం యూనివర్సిటీ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహిస్తున్న కేంద్ర విశ్వవిద్యాలయాలు చదువుల్లో పురోగమిస్తున్నాయి. కొత్త నాయకత్వాన్ని అందిస్తున్నాయి. మన రాష్ట్ర పరిధిలోని వర్సిటీల్లో మాత్రం ఎలక్షన్స్ జరగకపోవడంతో వర్సిటీల వైభవం దెబ్బతిన్నదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఎన్నికలపై పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, ఆయా యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్లు సైతం ఎన్నికలు నిర్వహిస్తేనే ప్రజాస్వామ్యయుతమైన బాధ్యతల పట్ల అవగాహన వస్తుందని అంటున్నారు.

రాజకీయాల దిశ, దిశ నిర్దేశించిన ఓయూ

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశ రాజకీయ దశ దిశను మాత్రమే కాకుండా ప్రపంచ రాజకీయాలను విశ్లేషణ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం సమస్యలతో కునారిల్లుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విశ్లేషణ నుంచి విషాదంలోకి వెళ్లిపోయింది. గతంలో తనదైన ప్రజా ఉద్యమాలు మొదలుకుని, ప్రత్యేక రాష్ట్ర సాధనకు జంగు సైరన్ అయి మోగింది. ఒకప్పుడు ఉస్మానియాలో చదువుకోవాలంటే ఎంతో ప్రతిభ, అదృష్టం ఉండాలనేవారు. ఇక్కడి నుంచి ఎందరో ప్రముఖులు, రాజకీయ నాయకులు దేశ, రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అలాంటి ఉస్మానియా ప్రస్తుతం దీన స్థితిలో ఉందని చెప్పక తప్పదు. విద్యార్థి సంఘ ఎన్నికలు జరుగుతున్న సెంట్రల్ వర్సిటీలు, విద్యార్థి ఎన్నికల్లేని రాష్ట్ర వర్సిటీల మధ్య వ్యత్యాసం చాలా ఉంది..? చదువుల్లో, పరిశోధనల్లో సెంట్రల్ వర్సిటీలు రాటుదేలుతుంటే.. ఓయూ వంటి రాష్ట్రీయ విద్యాలయాలు ఇంకా నాసిరకం భోజనం అందిస్తున్నారనే ఆందోళనల వద్దే ఆగిపోయాయి. ప్రొఫెసర్ల కొరత విషయం వద్దే ఆగిపోయాయి. ఈ పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మహానేతలను అందించిన వర్సిటీలు

వివిధ పార్టీలు, వాటి భావాజాలాలకు బీజం పడేది యూనివర్సిటీల్లోనే. విద్యార్థులను ప్రధాన చైతన్య స్రవంతిలోకి తీసుకెళ్లేది, రాజకీయం, రాజ్యాంగం, శాసన వ్యవస్థలపై వారు పట్టు సాధించేది ఇక్కడే. ఆయా పార్టీల సిద్ధాంతాలు, ప్రభావిత అంశాల ఆధారంగా స్టూడెంట్స్ బలమైన వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఏర్పరుచుకుంటారు. మన వ్యవస్థల పట్ల ఒక అవగాహనను కలిగి ఉంటారు. నవతరం నాయకులకు నాంది పడేది వర్సిటీల్లోనే. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, మాజీ ప్రధానమంత్రి పీ.వీ నరసింహారావు ఇలా ఎందరో మహా నేతలను యూనివర్సిటీలు అందించాయి. దేశ, రాష్ట్ర రాజకీయాలను నడిపించడంలో వీరి భాగస్వామ్యం ఉంది.

దారి తప్పిన విద్యార్థి సంఘాలు

రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా విద్యార్థి సంఘలు పుట్టుకొస్తున్నా.. విద్యార్థి సమస్యలపై నిలదీసే చైతన్యవంతమైన విద్యార్థి సంఘాలు ఎప్పుడో ట్రాక్ తప్పాయి. అందుకే బాధ్యతాయుతమైన విద్యార్థి సంఘం, విద్యార్థులకు జవాబుదారీగా ఉండే గుర్తింపు సంఘం ఉండాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం విద్యార్థి సమస్యలకు మాత్రమే పరిమితం కాదు. ఇక్కడి ఈ చైతన్యం తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షలను ఎత్తిపడుతుంది. పార్లమెంటు, అసెంబ్లీలో క్రిమినల్ స్వభావం ఉన్న నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్లు సమాజానికి ఏ సందేశం ఇస్తారు? వీళ్లు ఎవరికోసం చట్టాలు రూపొందిస్తారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను మౌనముని అని ఎగతాళి చేసినోళ్లు.. ఆయన మరణం తర్వాత ఆకాశానికి ఎందుకు ఎత్తారు?.. కారణం తన ప్రతిభ, చదువు. విశ్వవిద్యాలయాల్లో తను నేర్చుకున్న విలువలు.. అందుకే విశ్వ విద్యాలయాల్లో ఎన్నికల నిర్వహణ జరగాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.

ఎప్పుడో హత్య జరిగిందని ఎలక్షన్స్‌పై నిషేధం

ఎప్పుడో ఓ హత్య జరిగిందని వర్సిటీల్లో ఎన్నికలు నిషేధించారు. అలిపిరిలో చంద్రబాబుపై ఎటాక్ జరిగిందని.. తిరుపతి వెళ్లడం ఆయన మానేశారా? రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో ఓటమి పాలయ్యాడని రాజకీయాల నుంచి తప్పుకున్నారా? అంబర్‌పేట్‌లో కిషన్‌రెడ్డి ఓడిపోయాడు అని రాజకీయ సన్యాసం తీసుకున్నాడా? అందుకే.. ఓ ఘటనను సాకుగా చూపి కాలయాపన చేయడం సరైంది కాదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అవసరమైతే లింగ్డో కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కానీ, ఎలాగైనా ఎన్నికలను నిర్వహించాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం అల్లర్లకు అవకాశం ఉంటుందని, వర్సిటీల్లో ఎన్నికలు జరగపోవడమే మంచిదని కోరుతున్నారు. అయితే, మోజార్టీ శాతం విద్యార్థులు, ప్రొఫెసర్లు వర్సిటీల్లో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు.

ఎన్నికలు జరపాలి: టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ నాయకుడు

యూనివర్సిటీల్లో ఎన్నికలు జరపాలని మేం కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు వర్సిటీల్లో ఎన్నికలు జరిగితే ఇబ్బందులు వస్తాయని భావిస్తే 1986లో ఏర్పాటు చేసిన లింగ్డో కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. లింగ్డో కమిషన్ సిఫార్సులకు మేం సహకరిస్తాం. ఇప్పటికే కేరళ, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో వర్సిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సెంట్రల్ వర్సిటీల్లోనూ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రజాస్వామిక భావాలు, హక్కులను సాధించుకునేందుకు ప్రజాస్వామ్యయుత పోరాటాలు జరిపేందుకు ఎన్నికలు జరగడం అత్యంత ఆవశ్యకం. లింగ్డో కమిషన్ సైతం ఎన్నికలు జరపాలని చెప్పింది.

Next Story