డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటాం : మహీంద్రా యూనివర్సిటీ

by Muthe.Rajitha |

హైదరాబాద్ లోని టెక్ మహీంద్రా యూనివర్సిటీలో ఇటీవల నార్కోటిక్ అధికారుల తనిఖీల్లో ఐదుగురు విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నట్టు గుర్తించిన సంగతి తెలిసిందే.

డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటాం : మహీంద్రా యూనివర్సిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని టెక్ మహీంద్రా యూనివర్సిటీలో ఇటీవల నార్కోటిక్ అధికారుల తనిఖీల్లో ఐదుగురు విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నట్టు గుర్తించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజులు మెదురి ఓ లేఖ విడుదల చేశారు. మహీంద్రా యూనివర్సిటీ క్రమశిక్షణ, విలువలను కాపాడతామని, చట్టాన్ని గౌరవిస్తామని అన్నారు. ఇటీవల తమ వర్సిటీలో కొంతమంది విద్యార్థులు నార్కోటిక్స్ కేసులో పట్టుబడటం తమను ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. డ్రగ్స్ వాడకం, అక్రమ రవాణా వంటి చర్యలకు తాము పూర్తిగా వ్యతిరేకమని, యూనివర్సిటీ నియమాలను ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.

వర్సిటీకి చెడ్డ పేరు తెచ్చే వారి పట్ల తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని వెల్లడించారు. క్యాంపస్‌ను బాధ్యతాయుతంగా నడపడానికి అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రతి విద్యార్థి సురక్షితంగా చదువుకునేలా క్యాంపస్‌ను తీర్చి దిద్దుతామని హామీ ఇస్తున్నామన్నారు. ఇకపై వర్సిటీలో డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పించేలా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. విలువలు, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించేందుకు క్యాంపస్ సిబ్బంది, ప్రొఫెసర్స్, విద్యార్థులు తమకు సహకరించాలని కోరారు.

Next Story