- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాంకేతిక విద్యాశాఖలో విచిత్ర పరిస్థితి
తెలంగాణ సాంకేతిక విద్యా శాఖలో ఒకే అధికారికి అబ్దుల్లాపూర్‌మెట్, మణుగూరు పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ బాధ్యతలతో పాటు సెట్స్ ఏసీవో పోస్టును కట్టబెట్టడం వివాదాస్పదమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: సాంకేతిక విద్యా శాఖలో బదిలీలు, బాధ్యతల కేటాయింపులు వివాదాస్పదంగా మారుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా, అర్హులైన అధికారులు ఎందరో ఉన్నప్పటికీ.. ఒకే ఒక్క వ్యక్తికి మూడు కీలక పోస్టులను కట్టబెట్టడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఉన్నతాధికారుల పక్షపాత వైఖరిపై శాఖలోనే కాకుండా విద్యార్థి సంఘాలు, ఇతర అధికారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ఒకే చేతిలో మూడు బాధ్యతలు
విశ్వసనీయ సమాచారం ప్రకారం సాంకేతిక విద్యా శాఖలో పనిచేస్తున్న ఒకే ఒక్క అధికారికి ఏకంగా మూడు కీలక బాధ్యతలను అప్పగించారు. హైదరాబాద్ హయత్ నగర్‌లోని అబ్దుల్లాపూర్ మెట్‌లో పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్న వ్యక్తికి, మణుగూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి పూర్తి అదనపు బాధ్యతలతో ప్రిన్సిపాల్‌గా నియమించడమే కాకుండా, అత్యంత కీలకమైన సెట్స్ అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్‌గా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు.
అర్హులున్నా... కొందరికే అందలం
శాఖలో సమాన అర్హతలు, సీనియారిటీ కలిగిన అధికారులు ఎందరో ఉన్నప్పటికీ, వారిని పక్కన పెట్టి ఒకే వ్యక్తికి ఇన్ని పదవులు కట్టబెట్టడం వెనుక ఉన్న ఆంతర్యమేంటనే చర్చ సాంకేతిక విద్యాశాఖ లో జోరుగా సాగుతోంది. కమిషనరేట్‌లో ఆంధ్రా ఉన్నతాధికారులు, తెలంగాణకు చెందిన వారికి కాకుండా, ఆంధ్రాకు చెందిన వారికే కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారని ఇటు విద్యార్థి సంఘాలు, అటు అంతర్గతంగా డిపార్టుమెంటులో చర్చ నడుస్తోంది. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకే సమయంలో ఇన్ని కీలక బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం అసాధ్యమని, దీనివల్ల విద్యాసంస్థల పర్యవేక్షణ కుంటుపడుతుందని అధ్యాపక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా పరీక్షల నిర్వహణ, అడ్మిషన్ల ప్రక్రియలో కీలకమైన సెట్స్ ఏసీవో పోస్టును ఒకే వ్యక్తికి ఇవ్వడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కమిషనర్ తీరుపై విమర్శల వెల్లువ
ఈ వ్యవహారంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. అర్హులైన ఇతరులకు అవకాశం కల్పించకుండా, కొందరికే అందలం ఎక్కించడం వెనుక అంతర్యమేమిటనే చర్చ జోరుగా సాగుతోంది. కమిషనర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల శాఖలో పారదర్శకత లోపించిందని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి పునఃసమీక్షించాలని, అర్హులైన ఇతరులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.






